
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టిషాక్ తగిలింది. ఐపీఎల్ 2020లో కీలక మ్యాచ్‌ల ముందు ఆ జట్టు పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్ వేస్తున్న సమయంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. సైనీ బొటన వేలి చూపుడు వేలి మధ్య భాగంలో చీలిక వచ్చిందని ఆ జట్టు హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్‌లీ తెలిపాడు.
'సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. అతని చేతి వేలి పక్క భాగంలో చీలిక వచ్చింది. అదృష్టవశాత్తూ మాకు మంచి హ్యాండ్ సర్జన్ ఉన్నాడు. అతను చక్కగా కుట్లు వేశాడు. రాత్రంతా అతడి గాయాన్ని పర్యవేక్షిస్తాం. తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అని తర్వాత చెబుతాం.' అని స్పీచ్‌లీ తెలిపాడు.

నాలుగైదేళ్ల క్రితం కోల్‌కతాలో కోహ్లీ కూడా ఇలాగే గాయపడ్డాడని, అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేయడంతో బ్లీడింగ్ ఆగిపోయిందన్నాడు. ఆ తర్వాత విరాట్ సెంచరీ చేశాడని స్పీచ్‌లీ గుర్తు చేశాడన్నాడు. ఈ రెండు గాయాలను పోల్చి చూడలేమన్న స్పీచ్‌లీ.. సైనీ బౌలింగ్ చేసే చేతికి గాయం కావడంతో.. అతనిపై ఒత్తిడి ఉంటుందన్నాడు. సైనీ తర్వాతి మ్యాచ్‌లో, ఐపీఎల్ మిగతా సీజన్‌లో ఆడే అవకాశం ఉందని స్పీచ్‌లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆర్‌సీబీ తరఫున బౌలింగ్‌లో అదరగొడుతున్న సైనీ.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 28న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.