
దుబాయ్: ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం అంత సులువు కాదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. గురువారం ఏకపక్షంగా సాగిన క్యాలిఫయర్-1 మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఢిల్లీని ముంబై చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ప్రతీ రాత్రి మనది కాదన్నాడు. తమ జట్టు ఓడినప్పటికీ తాను నెగటీవ్‌గా మాట్లాడలేనని తెలిపాడు.
'ఈ ఓటమి కఠినంగానే ఉంది. అయినప్పటికీ మా జట్టు గురించి నెగటీవ్‌గా మాట్లాడదలుచుకోలేదు. సానుకూల దృక్పథంతో తదుపరి మ్యాచ్‌లో విజయం సాధిస్తాం. ఆరంభంలో రెండు వికెట్లు తీసిన తర్వాత మ్యాచ్‌లో పై చేయి సాధించాం. 13, 14 ఓవర్లలో ముంబై 110 పరుగులే చేసింది. ఆ పరిస్థితిని అలానే కొనసాగించి 170 పరుగులకు పరిమితం చేస్తే మాకు గెలిచే అవకాశం ఉండేది. కానీ ఇవన్నీఆటలో సహజమే. ప్రతీ రాత్రి మనది కాదు కదా. మ్యాచ్ గెలవడానికి మాకున్న ప్రతీ అవకాశంపై మాట్లాడుకున్నాం. ఇక బయో బబుల్ వాతావరణంలో ప్రతీ రోజు ఒకేలా ఉండటం అంత సులువు కాదు.
ప్రాక్టీస్‌లో చాలా కష్టపడ్డాం. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనెప్పుడూ వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తాడు. అతను బ్యాట్స్‌మెన్ మైండ్స్‌తో ఆడుకుంటాడు. ముంబైలో ప్రతీ బ్యాట్స్‌మెన్ మంచి టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా లోయరార్డ్‌లో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది. దాంతో వారి టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు పూర్తి స్వేచ్చగా ఆడే అవకాశం దక్కుతుంది. పైగా వారంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాంటి వారిని అడ్డుకోవడం అంత సులువుకాదు'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.
వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.