
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ పుట్టెడు దు:ఖంతోనే బరిలోకి దిగాడు. శుక్రవారం రాత్రే మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించాడు. అయినా ఆ బాధను పంటి బిగువన అదిమిపెట్టి.. జట్టు విజయం కోసం బరిలోకి దిగాడు. మయాంక్ అగర్వాల్ గాయపడటంతో ఓపెనర్‌గా తన సేవలందించేందుకు మన్‌దీప్ ముందుకు వచ్చాడు. తన ధైర్యమైన నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం చేస్తోంది.
దిగ్గజ సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి సాధారణ అభిమాని వరకు అందరూ మన్‌దీప్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఆటపై మన్‌దీప్‌కు ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుందని ప్రశంసిస్తున్నారు. అతని తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. ఇక మన్‌దీప్ తండ్రికి నివాళిగా పంజాబ్ ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో మైదానంలోకి దిగారు. అయితే ఈ మ్యాచ్‌లో మన్‌దీప్ 17 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించిన విషయాన్ని కింగ్స్ పంజాబ్ జట్టే తమ అధికారిక ట్విటర్‌లో తెలియజేసింది. మన్‌దీప్ నిర్ణయాన్ని కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఇక మన్‌దీప్ ధైర్యాన్ని కొనియాడుతూ.. సచిన్, ఆకాష్ చోప్రా కూడా ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసంతాపాన్ని ప్రకటించారు. డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నితీష్ రాణా సూపర్ ఫిప్టీతో తనకు పిల్లనిచ్చిన మామ సురీందర్‌కు ఘన నివాళులర్పించాడు. ఆయన కూడా శుక్రవారమే క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ విషయాన్ని కూడా సచిన్ తన ట్వీట్ ప్రస్తావించారు.