ధోనీ క్రీడాస్ఫూర్తి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ వ్యూహాలు సక్సెస్ అవగా.. కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీడాస్ఫూర్తిని చాటాడు. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఏ సమయంలో ఎలా ఆడాలి, ఎలాంటి షాట్లు బాదాలి, మ్యాచ్‌ను ఎలా అధ్యయనం చేయాలి వంటి అంశాలను వారికి వివరించాడు.

షాట్ సెలక్షన్ తప్పిదాలపై
పీయూస్ చావ్లా బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయి మయాంక్ అగర్వాల్ ఔటవగా.. శార్ధూల్ ఠాకూర్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడుతూ కేఎల్ రాహుల్ వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో ఇద్దరూ ఔటైన తీరుని ప్రస్తావిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. షాట్ సెలక్షన్‌లో తప్పిదాల్ని మహీ ఇద్దరికీ వివరించినట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌గా ఇదే తొలి సీజన్
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. గతంలోనూ అతనికి కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. దాంతో బ్యాట్స్‌మెన్‌గా సక్సెస్ అవుతున్న రాహుల్.. కెప్టెన్‌గా మాత్రం తేలిపోతున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ కెప్టెన్సీలో ఐదు మ్యాచ్‌లాడిన పంజాబ్.. ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ అయినప్పటికీ.. ఎలాంటి భేషజాలు చూపకుండా ధోనీ సలహాలివ్వడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

హోరాహోరీగా తలపడ్డాయి
చెన్నై, పంజాబ్ ఆదివారం రాత్రి తలపడ్డాయి. రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఎందుకంటే.. అప్పటికే నాలుగు మ్యాచులాడి మూడింట్లో ఓడిపోయాయి. అందుకే హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ మొదట 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (63), మయాంక్ అగర్వాల్ (26), నికోలస్ పూరన్ (33) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో పంజాబ్ బౌలింగ్‌ను చెన్నై ఓపెనర్లు ఆడుకున్నారు. వికెట్లేమీ నష్టపోకుండా 17.4 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (83; 53 బంతుల్లో 11×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్ (87; 53 బంతుల్లో 11×4, 1×6) సునాయాస విజయాన్ని అందించారు.
Delhi Capitalsకు భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2020 నుంచి సీనియర్ స్పిన్నర్ ఔట్!!


Click it and Unblock the Notifications
