
దుబాయ్: వరుస పరాజయాలు తీవ్ర బాధను కలిగిస్తున్నాయని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. ఎక్కడ విఫలమవుతున్నామో తమకు తెలుసని, బలంగా పుంజుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశాడు.
'వరుస మ్యాచుల్లో ఓటమి పాలవ్వడం బాధాకరం. మేం మరింత మెరుగ్గా, బలంగా పుంజుకోవాలి. మా తప్పులు తెలుసుకోకపోవడానికి ఇదేం రాకెట్ సైన్స్ కాదు. మా తప్పిదాలు మాకు తెలుసు. ప్రణాళికలను అమలు చేయడంలోనే విఫలమవుతున్నాం. నాకు తెలిసి 178 పరుగులు మంచి స్కోరే. మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ నెమ్మదిగా అనిపించింది. దాంతో 170-180 పరుగులు సరిపోతాయనుకున్నాం. అలాగే వికెట్లు తీయకుంటే కష్టాలు తప్పవని కూడా ఊహించాం. తొలి 7-8 ఓవర్లలో వికెట్లు తీసుంటే మ్యాచ్‌లో నిలిచేవాళ్లం. కానీ పవర్ ప్లేలో ఓవర్‌కు పది పరుగులు వస్తున్నప్పుడు కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శించడం కాస్త కష్టమే. వాళ్లంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లు. ఎక్కడ తప్పిదం జరుగుతుందో వారికి బాగా తెలుసు. మేం మరింత సాధన చేసి, శ్రమించి మ్యాచుల్లో చిన్న చిన్న మూమెంట్స్‌ను గెలిచేందుకు ప్రయత్నించాలి. మున్ముందు పుంజుకుంటామనే ఆశిస్తున్నాం' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి.