అనిల్ కుంబ్లే ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ: కేఎల్ రాహుల్

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్‌గా భారత దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటం తమ అదృష్టమని ఆ జట్టు సారథి, టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. కుంబ్లే పర్యవేక్షణలో జట్టు నడిపించడం అంత కష్టమేం కాదన్నాడు. ఆయన వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయగలిగితే విజయాలను అందుకోవచ్చన్నాడు. ఒకే రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లం కావడంతో తమ మధ్య మంచి సంబంధాలున్నాయన్నాడు. అతను కోచ్‌గా ఉండటం వల్ల కెప్టెన్‌గా తన పని సులువు అవుతుందని చెప్పాడు. దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ 2020 సీజన్ కోసం సమాయత్తం అవుతున్న రాహుల్.. లీగ్ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లేపై ప్రశంసల జల్లు కురిపించాడు.

మాకు కలిసొచ్చే అంశం..
‘ఈ సీజన్‌లో అనిల్ భాయ్ మాతో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఒకే నగరం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి మైదానంలోనూ, బయట ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనిల్ భాయ్ కోచ్‌గా ఉండటం వల్ల కెప్టెన్‌గా నా పని సులువవుతుంది. జట్టు ప్రణాళికలు ఆయనే రూపొందిస్తారు. వాటిని అమలు చేయడమే మా బాధ్యత' అని రాహుల్ తెలిపాడు.

చెలరేగుతాం..
క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్న పంజాబ్.. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుందని ఈ నయా కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మ్యాక్స్‌వెల్ గతంలోనూ పంజాబ్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అందుకే వేలంలో అతని కోసం పోటీపడి మరి తీసుకున్నాం. తనదైన రోజున అతను ఏ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు. గత రెండు సీజన్లలో మా జట్టు మిడిలార్డర్‌లో అలాంటి బ్యాట్స్‌మన్ లేని లోటు కనిపించింది. గేల్‌తో కూడా చాలా ఏళ్లు కలిసి ఆడాను. మా జట్టులో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. అతను మా బ్యాటింగ్‌లో కీలక భాగం. అతని అనుభవంతో మ్యాచ్‌లు గెలిపించగలడు. ఈ ఐపీఎల్ సీజన్ ఎన్నో విధాలా ప్రత్యేకమైంది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అని రాహుల్ తెలిపాడు.

రఫ్ఫాడించిన రాహుల్..
రాహుల్ గత రెండు సీజన్లలో రఫ్ఫాడించాడు. 2018 సీజన్‌లో 54.91 సగటుతో 659 పరుగులు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. 2019లో 14 మ్యాచ్‌ల్లో 593 రన్స్ చేశాడు. కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా మారి జట్టు కెప్టెన్‌గా మారాడు. ఈ సీజన్‌తో తన నాయకత్వ నైపుణ్యాలను పరీక్షించుకోబోతున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రాహుల్ పంజాబ్ జట్టుకు సేవలందించనున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా కీపర్ స్థానం ఖాళీ అయింది. పంత్ ఉన్నా మెప్పించలేకపోతున్నాడు. ఇప్పటికే రాహుల్ వికెట్ల వెనుకాల రాణించాడు. ఐపీఎల్‌లో కూడా మెరిస్తే అతనికి తిరుగుండదు..

ధోనీలా అవ్వాలని..
ఇక ధోనీలా అవ్వాలనే క్రికెట్ కెరీర్ ఎంచుకున్నామని ఇటీవల రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ధోనీలా అవ్వాలని మా కెరీర్లను ప్రారంభించాం. మారుమూల పట్టణం వచ్చి ఎన్నో ఘనతలు సాధించిన అతడే మా హీరో. ఎక్కడ నుంచి వచ్చామనేది కీలకం కాదు, లక్ష్యం కోసం ఎలా శ్రమించామనేది ముఖ్యం. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దేశంతో పాటు ప్రపంచ క్రికెట్ భావోద్వేగానికి లోనైంది'' అని రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ పదమూడో సీజన్ యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications