
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), ఇయాన్ మోర్గాన్(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(3/35) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్(2/25), రవి బిష్ణోయ్ (2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, మ్యాక్స్‌వెల్‌కు చెరొక వికెట్ దక్కింది.
మోర్గాన్-శుభ్‌మన్ ధాటికి ఓ దశలో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన కోల్‌కతా పంజాబ్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్‌కే రాణా.. గేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి (7), దినేశ్ కార్తీక్(0)ను మహ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. దాంతో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో కోల్‌కతా పవర్ ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రవిబిష్టోయ్ విడదీశాడు. అద్భుత బంతితో మోర్గాన్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్(6), నాగర్ కోటీ (6), ప్యాట్ కమిన్స్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. మరోవైపు శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా పరుగుల వేగం తగ్గింది. శుభ్‌మన్ గిల్ కూడా ఔటవ్వడంతో కోల్‌కతా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 10 ఓవర్లలో 92 పరుగులు చేసిన కోల్‌కతా.. తరువాతి 10 ఓవర్లలో 57 రన్స్ మాత్రమే చేసింది.