
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్ల మధ్య రాయుడు చాలా నెమ్మదిగా పరుగెడుతున్నాడని, క్విక్ డబుల్స్, సింగిల్స్ తీయడం లేదన్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో రాయుడు మేల్కోనాలని, విరాట్ కోహ్ల, డివిలియర్స్, డూప్లెసిస్, వార్నర్, బెయిర్ స్టోలోను చూసి నేర్చుకోవాలని సూచించాడు.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రాయుడు.. 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు మాత్రమే చేశాడు. అతని నెమ్మదైన బ్యాటింగ్‌తో చెన్నై మూల్యం చెల్లించుకుంది. అయితే రాయుడు వికెట్ల మధ్య క్విక్‌గా పరుగెత్తలేకపోయాడని, డబుల్ వచ్చే దగ్గర సింగిల్ తీసాడన్నాడు. సహచర ఆటగాడు జగదీషన్ ఫస్ట్ రన్ పూర్తి చేసుకోని సెకండ్ రన్ కు సిద్దమైతే.. రాయుడు మాత్రం సింగిల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించాడు.
'వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో అంబటి రాయుడు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లను చూడు. వాళ్లు వికెట్ల మధ్య ఎలా పరుగెడుతున్నారో చూడు.
వారు ఎంత కష్టపడుతున్నారో గమనించు. ఇలాంటి చేజింగ్ చేస్తున్నప్పుడు మీరెవరో నాకు అనవసరం. కానీ వికెట్ల మధ్య పరుగు మాత్రం బాగుండాలి. కోహ్లీ, డివిలియర్స్, డూప్లెసిస్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలను చూడు. వారు ఒక స్టాండర్డ్‌ను సెట్ చేశారు. వారిని అనుసరించు'అని రాయుడికి పీటర్సన్ చురకలంటించాడు. ఇక పెద్ద మైదానాల్లో బౌండరీలు రాబట్టడం కష్టం కాబట్టే విరాట్ తన ఇన్నింగ్స్‌లో క్విక్ డబుల్స్, సింగిల్స్ తీసాడు. ఇది చెన్నై ఆటగాళ్లలో కనిపించలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.