
దుబాయ్: కరోనా వైరస్ బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ త్వరగా కోలుకోవాలని అతడి సోదరుడు రాహుల్ చాహర్, సోదరి మాలతీ చాహర్ ఆకాంక్షించారు. శుక్రవారం ప్రాక్టీస్‌కు సిద్దమైన ఆ జట్టుకు నిబంధనల మేరకు పరీక్షలు చేయించగా.. ఒక బౌలర్‌తో పాటు, 11 మంది సహాయక సిబ్బందికి కరోనా పాజిటీవ్ అని తెలింది. ఈ వార్త క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. తొలుత ఆ క్రికెటర్ పేరు వెళ్లడించకపోయినా.. ఇటీవల భారత్ తరపున ఆడుతున్న కుడి చేతివాటం పేసరనే హింట్ అందింది. దీంతో అతను దీపక్ చాహరేనని సోషల్ మీడియా కోడై కూసింది.
ఈ నేపథ్యంలోనే శనివారం అతడి సోదరుడు, క్రికెటర్ రాహుల్ చాహర్, సోదరి మాలతి చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వో నిజమైన యోధుడివి. పోరాడేందుకే పుట్టావ్. చిమ్మని చీకటి తర్వాత వచ్చేది ప్రకాశవంతమైన రోజే. ఇంతకుముందు కన్నా మరింత దృఢంగా నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నా. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మళ్లీ నువ్వు మైదానంలో గర్జించాలని ఎదురుచూస్తున్నా.'అని చాహర్ సోదరి మాలతీ పేర్కొంది. చెన్నై వేదికగా నిర్వహించిన ఐదు రోజుల ప్రాక్టీస్ క్యాంప్‌కు బయలుదేరేముందు దీపక్‌ను మాలతీనే విమానాశ్రయంలో డ్రాప్ చేసింది.
ఇక క్రికెటర్ రాహుల్ చాహర్ 'బ్రో.. ధైర్యం కోల్పోకుండా ఉండు. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నా'అని ట్వీట్ చేశాడు. ఇక చెన్నై అభిమానులు కూడా దీపక్ చాహర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. అలాగే శనివారం చెన్నై ఫ్రాంచైజీకే చెందిన మరో బ్యాట్స్‌మన్ రుతురాజ్ కూడా వైరస్ బారిన పడ్డాడని తెలిసింది. బీసీసీఐ కూడా ఒక అధికారిక ప్రకటనలో మొత్తం 13 మందికి వైరస్ సోకిందని చెప్పింది. వారిప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని పేర్కొంది. అయితే ఎవరా? అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.