
షార్జా: మంచి భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడంతోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు భువనేశ్వర్ గాయం కూడా తమను దెబ్బ తీసిందన్నాడు.
'ఒకసారి గణంకాలను పరిశీలిస్తే.. ముంబై జట్టులోని ఇద్దరు అనుభజ్ఞులైన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కట్టడి చేశారు. వికెట్ కూడా కొంచెం నెమ్మదిగా అనిపించింది. 209 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం ఓవర్‌కు 10 రన్స్ చేయడానికి ప్రయత్నించాం. కానీ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. భువీ గాయంతో దూరమవడం.. ఇద్దరు కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడం కూడా ప్రతికూలంగా మారింది. మేం చాలా విషయాల్లో మెరుగవ్వాలి. ట్రైనింగ్‌లో వాటిపై దృష్టిసారిస్తాం. మా బౌలర్లు ఏకంగా 7 ఫుల్ టాస్‌లు వేయడం లెక్కించాను. మా ప్రణాళికలను అమలు చేయడంలో కూడా విఫలమయ్యాం.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీకి తోడుగా ఇషాన్ కిషాన్(31), హార్దిక్ పాండ్యా(28), కృనాల్ పాండ్యా(20) మెరుపులు మెరిపించారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్, కౌల్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) రాణించినా ఫలితంలేకపోయింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. బెయిర్ స్టో(25), మనీష్ పాండే(30)లు తమ జోరును కొనసాగించలేకపోయారు.