ఐపీఎల్: ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తోన్న ఆటగాళ్లు వీరే

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అంతకముందు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు అంటున్నా అది కొంత మేరకే.
అదే, ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తే ఒక్కసారిగా వెలుగులోకి స్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత పది సీజన్లలో అలానే ప్రదర్శన చేసి టీమిండియాలో అనేక మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కొందరు కుర్రాళ్లు అవకాశం దక్కితే సత్తా చాటాతామని అంటున్నారు. ఈ సీజన్‌లో కృష్ణప్ప గౌతమ్, శుభ్‌మాన్ గిల్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేసినప్పటికీ, ఇంకా కొంత మంది ఆటగాళ్లు ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తునే ఉన్నారు. వారెవరో చూద్దాం...

మన్‌జోత్ కల్రా (ఢిల్లీ డేర్ డెవిల్స్)
అండర్-19 వరల్డ్ కప్‌తో మన్‌జోత్ కల్రా అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అతడిని ప్రత్యేకంగా నిలిపేలా చేసింది. ఎడమ చేతివాటం ఓపెనర్ కావడం, జాతీయ జట్టుకు ఇలాంటి శైలి ఆటగాడు అవసరం ఉండటంతో తనపై అంచనాలు పెరిగాయి. ఢిల్లీకే చెందిన ఈ కుర్రాడిపై ఎంపిక సమయంలో కెప్టెన్ గంభీర్ అపార నమ్మకం ఉంచాడు. కానీ, ఈ సీజన్‌లో ఢిల్లీ వరసు వైఫల్యాలతో సతమతం అవడం... కల్రాకు ముందే పృథ్వీ షాకే అవకాశం ఇవ్వడంతో అతడ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.

నవ్‌దీప్ షైనీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న నవదీప్ సైనికి ఇది మొదటి ఐపీఎల్ కాదు. గతంలో డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆట తీరు ఎంతో మెరుగుపర్చుకున్న తర్వాత కోహ్లీ దృష్టిలో పడిన ఈ ఢిల్లీ కుర్రాడిని అతడి నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ బౌలర్లలో క్రమం తప్పకుండా ఉండే షైనీ పేరు ఒక దశలో జట్టు ఎంపికలోనూ వినిపించింది. అయితే, ఈ సీజన్‌లో సిరాజ్‌పై కోహ్లి నమ్మకం ఉంచడం, అతడు కుదురుకుంటుండటంతో షైనీకి తుది జట్టులో చోటు దక్కడం లేదు.

ఖలీల్ అహ్మద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
2016లో భారత అండర్-19 జట్టు సభ్యుడిగా ప్రదర్శన చూసి రాజస్తాన్‌కు చెందిన ఈ పేసర్‌ను హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసింది. కానీ, రెండు సీజన్లలోనూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. రాహుల్ దవ్రిడ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఖలీల్‌కు ఈ సారీ ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుత సన్‌రైజర్స్ లైనప్ ప్రకారం ఎడమ చేతివాటం ఖలీల్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. గాయంతో ప్రధాన పేసర్ భువీ దూరమైనా... సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మ, బాసిల్ థంపి వంటి బౌలర్లపైనే జట్టు నమ్మకం ఉంచడంతో ఖలీల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

సందీప్ లమిచానే (ఢిల్లీ డేర్‌డెవిల్స్)
లెగ్ స్పిన్ నైపుణ్యం ఇతడి సొంతం. ఆ స్పిన్‌తోనే ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు. క్లార్క్ సిఫారసుతో ఢిల్లీ హెడ్ కోచ్ పాంటింగ్... లమిచానేను వేలంలో కొనుగోలు చేశాడు. దీంతో ఐపీఎల్ ఆడనున్న తొలి నేపాలీగా రికార్డుల్లోకి ఎక్కుతాడని అనుకున్నారు. అయితే, జట్టులో అమిత్ మిశ్రా, తేవటియా రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంతో సందీప్‌కు చోటు దక్కడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే... లమిచానేకు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

మంజూర్ దార్ (పంజాబ్ కింగ్స్ ఎలెవెన్)
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మంజూర్ దార్ ఆల్ రౌండర్. మంచి హిట్టర్ కూడా. కరుణ్‌నాయర్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారిలలో ఏ ఇద్దరినైనా పక్కకుపెడితే తప్ప... మంజూర్ దార్‌కు చోటు దక్కడం కష్టం. పర్వేజ్ రసూల్ తర్వాత ఐపీఎల్ ఆడిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న మంజూర్ ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications