ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఇది 1000వ ఐపీఎల్ మ్యాచ్ కావడంతో బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లతో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కరలను ప్రత్యేక మొమెంటోలతో సత్కరించింది.
ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జై షా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఎంతో స్పెషల్. ముంబై ఇండియన్స్ సారథ్యం చేపట్టి నేటికి సరిగ్గా 10 ఏళ్లు కాగా.. రోహిత్ నేడు 36వ జన్మదినం జరుపుకుంటున్నాడు.

దాంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఇక రోహిత్ ఫ్యాన్స్ భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ బ్యానర్‌లో రోహిత్ ఐదు టైటిళ్లతో ఉన్న ఫోజ్ ఉంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
టాస్ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది ఇదే రోజు రాజస్థాన్‌తోనే ఆడి విజయాన్నందుకున్నామని గుర్తు చేసుకున్న రోహిత్.. నాటి ఫలితం రిపీట్ అవుతుందని తెలిపాడు. పిచ్ కాస్త డ్రైగా ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. టీమ్ కాంబినేషన్ కోసం జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన రోహిత్ శర్మ.. జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్ జట్టులోకి రాగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రెండార్ఫ్ ఉద్వాసనకు గురయ్యారని తెలిపాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ తన జోరును కొనసాగిస్తున్నాడు. జోస్ బట్లర్‌తో కలిపి తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. జోస్ బట్లర్(18), సంజూ శాంసన(14), దేవదత్ పడిక్కల్(2) ఔటైనా.. జాసన్ హోల్డర్‌తో కలిసి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.