టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మధ్య మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా బాల్ టాంపరింగ్ చేస్తుందంటూ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
పిచ్ పొడిగా ఉన్నప్పుడు బంతి దానంతట అదే రివర్స్ స్వింగ్ అవుతుందని, ఆరోపణలు చేసే ముందు కాస్త బుర్ర ఉపయోగించాలని రోహిత్ శర్మ చురకలంటించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. టీచర్‌కే పాఠాలు చెబుతున్నావా? అని ప్రశ్నించాడు.

ఎలాంటి కండిషన్స్‌లో బంతి రివర్స్ స్వింగ్ అవుతుందో తమకు తెలుసన్నాడు. రివర్స్ స్వింగ్ టెక్నిక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశానికే రోహిత్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
తాను టీమిండియా బాల్ టాంపరింగ్ చేసిందని ఆరోపించలేదని, అంపైర్లు బంతిపై ఓ కన్నేయాలని మాత్రమే చెప్పానన్నాడు. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేయడంపై సందేహం వ్యక్తం చేశానని వివరణ ఇచ్చాడు.
'మొదటి విషయం ఏంటంటే మేం చెప్పినట్లే రోహిత్ శర్మ కూడా బంతి రివర్స్ స్వింగ్ అవుతుందని చెప్పాడు. రెండో విషయం ఎంటంటే బంతి ఎలా? ఎలాంటి పరిస్థితుల్లో రివర్స్ అవుతుందో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికే రివర్స్ స్వింగ్ టెక్నిక్‌ను పరిచయం చేశాం. టీచర్లకే పాఠాలు చెబుతానంటే ఎలా? మేం టీమిండియా బాల్ టాంపరింగ్ చేస్తుందని చెప్పలేదు. బంతిపై అంపైర్లు ఓ కన్నేయాలని మాత్రమే చెప్పాం.'అని ఇంజమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టడంపై ఇంజమామ్ ఉల్ హక్ సందేహం వ్యక్తం చేశాడు. సాధారణంగా బంతి పాతబడిన తర్వాత రివర్స్ అవుతుందని, కానీ కొత్త బంతితోనే అర్ష్‌దీప్ సింగ్ ఎలా రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని ప్రశ్నించాడు. అంపైర్లు కాస్త కళ్లు తెరిచి చూడాలన్నాడు.
ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఈ ప్రశ్నకు నేను ఏమని సమాధానం ఇవ్వాలి. సూర్యుడి కింద మండుటెండలో పొడిగా ఉన్న వికెట్‌పై ఆడుతున్నప్పుడు బంతి దానంతట అదే రివర్స్ స్వింగ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కే కాకుండా అన్ని జట్లకు రివర్స్ అవుతుంది.
కొన్నిసార్లు కాస్త బుర్రను ఉపయోగించాలి. మేం ఎక్కడ ఆడుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించాలి. బంతి రివర్స్ కాకపోవడానికి మేం ఏం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఆడటం లేదు.'అని రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు.