ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్ 2025లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఇంగ్లండ్ మాస్టర్స్‌తో నవీ ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో ధావళ్ కులకర్ణి(3/21), బ్యాటింగ్‌లో సచిన్ టెండూల్కర్, గుర్‌క్రీత్ సింగ్, యువరాజ్ సింగ్ సత్తా చాటడంతో ఇండియా మాస్టర్స్ సునాయస విజయాన్నందుకుంది.
చెలరేగిన కులకర్ణి..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. టీ అంబ్రోస్(22 బంతుల్లో సిక్స్‌తో 23),డారెన్ మ్యాడీ(24 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ ఇయన్ మోర్గాన్(13 బంతుల్లో ఫోర్‌తో 14) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇండియా మాస్టర్స్ బౌలర్లలో ధావళ్ కులకర్ణి(3/21) మూడు వికెట్లు తీయగా.. మిథున్(2/27), నేగి(2/16) రెండేసి వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్(1/27)కు ఓ వికెట్ దక్కింది.

సచిన్, యువీ విధ్వంసం
అనంతరం ఇండియా మాస్టర్స్ 11.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది. గుర్‌క్రీత్ సింగ్ మాన్(35 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 63 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. సచిన్ టెండూల్కర్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), యువరాజ్ సింగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ సోఫీల్డ్‌కు ఒక వికెట్ దక్కింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా మాస్టర్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
6️⃣💥4️⃣💥4️⃣ - A reminder why he's the 𝙈𝘼𝙎𝙏𝙀𝙍 𝘽𝙇𝘼𝙎𝙏𝙀𝙍 🫡#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/Q3H5QyuQem
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 25, 2025
6 జట్ల మధ్య పోటీ..
అలనాటి ఆటగాళ్లతో ఈ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ టోర్నీ మార్చి 16 వరకు జరగనుంది. నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తం 6 జట్లు ఈ టోర్నీ బరిలో నిలవగా.. ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్ జట్లు ఈ టోర్నీ బరిలో నిలిచాయి.
బరిలో తెలుగు తేజం..
ఇండియా మాస్టర్స్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తుండగా.. శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికాకు జాక్వెస్ కల్లీస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టులో సచిన్ టెండూల్కర్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, తెలుగు తేజం అంబటి రాయుడు, యుసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, వినయ్ కుమార్, షెహ్‌బాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగీ, గుర్‌క్రిత్ సింగ్, అభిమన్యు మిథున్‌లు ఉన్నారు.