ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ అనంతపురం వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు తెరలేవనుంది. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరులో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ టోర్నీ సంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంపిక చేసిన నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ప్రతీ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్‌లు తలపడుతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ,బీ,సీ, డీ జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో రెడ్ బాల్ క్రికెట్‌కు కుర్రాళ్లను సంసిద్దం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోహిత్, కోహ్లీ ఆడుతారని ప్రచారం జరిగినా.. వారితో పాటు అశ్విన్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. గాయాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే వారిని దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయించామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌ల సారథ్యంలోని నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బీ జట్టులో చోటు దక్కించుకోగా.. శ్రీకర్ భరత్, రికీ భుయ్ టీమ్ డీకి ఎంపికయ్యారు. హైదరాబాద్ ఆటగాళ్ల సిరాజ్ బీ, తిలక్ వర్మ ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఎంపికయ్యే భారత ఆటగాళ్లు.. దులీప్ ట్రోఫీకి దూరమవుతారు.
అనంతపూరంలోని రూరల్ డెవలెప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఏడీసీఏ స్టేడియం.. దులీప్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీమ్-ఏ, బీ మధ్య జరిగే తొలి మ్యాచ్ ఒక్కటే బెంగళూరు వేదికగా జరగనుండగా.. మిగతా 5 మ్యాచ్‌లు అనంతపూరం వేదికగానే జరగనున్నాయి. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు టీమ్ సీ, టీమ్ డీ మధ్య అనంతపురం వేదికగానే రెండో మ్యాచ్ జరగనుంది.