టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టీమిండియాకు సుదీర్ఘ కాలం ఆడటం సంతృప్తినిచ్చే విషయమని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
శిఖర్ ధావన్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనికి అభిమానులు, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. అభిమానులు మాత్రం శిఖర్ ధావన్ ఐకానిక్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటే ఏకైక భారత బ్యాటర్ శిఖర్ ధావన్ అని, గణంకాలతో సహా వివరిస్తున్నారు.

వివాదారహితుడిగా..
2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2018 ఆసియాకప్‌లో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వివాదరహితుడిగా.. సౌమ్యుడిగా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు. తన 12 ఏళ్ల కెరీర్‌లో శిఖర్ ధావన్ ఏనాడు సహనం కోల్పోలేదు. ఏ ఆటగాడితోనూ గొడవపడలేదు. తనను టీమిండియాకు ఎంపిక చేయకపోయినా.. ఎవర్నీ నిందించలేదు. విమర్శించలేదు. తన స్థానంలో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లను ప్రోత్సహించాడు.
అలాంటి శిఖర్ ధావన్.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీతో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా.. ఈ పర్యటను వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరిగింది.
గొడవ ఏమిటంటే...
మూడో రోజు ఆటలో నాటౌట్‌గా నిలిచిన శిఖర్ ధావన్ తర్వాతి రోజు ఉదయం బ్యాటింగ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. ప్రాక్టీసులో మణికట్టుకు దెబ్బ తగిలిందని మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. చివరి నిమిషంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో హుటా హుటినా కోహ్లీ బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ వెళ్లేందుకు సిద్దంగా లేనని కోహ్లీ చెప్పాడని, కానీ తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగాడని వార్తలు వచ్చాయి.
ఇక బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే శిఖర్ ధావన్‌పై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడంట. ఓపెనింగ్ సెషన్‌లో బరిలో దిగేందుకు భయపడే ధావన్ గాయాన్ని సాకుగా చూపాడని కూడా ఆరోపించాడట.
కోహ్లీX ధావన్
అందుకు ధావన్ బదులిస్తూ, దేశం కోసం ఆడడాన్ని గర్వంగా భావిస్తానని, ఆశించిన స్థాయిలో తన ఆటతీరు లేదనుకుంటే, జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోనని కోహ్లీకి స్పష్టం చేశాడంట. అంతేగానీ, లేని గాయాలను ఉన్నట్టుగా చెప్పనని అన్నాడట. ఈ వివాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడే ఉన్న అప్పటి టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాడని, కోహ్లీని మందలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై కోహ్లీ కానీ, గబ్బర్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ధోనీ ఓ కార్యక్రమంలో ఈ గొడవ గురించి ప్రశ్నించగా సరదాగా స్పందించాడు. సినిమా తీయాలని జోకులు పేల్చాడు.