
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల వెనుక జరిగే చీకటి బాగోతాలే ఇతివృత్తంగా తెరెకెక్కిన వెబ్ సిరీస్ 'ఇన్‌సైడ్జ్'. తొలి రెండు సీజన్లలో ఐపీఎల్ బాగోతాలను చూపించిన దర్శకుడు.. ఇటీవల విడుదలైన మూడో సీజన్‌ను మాత్రం టెస్ట్ క్రికెట్‌ను ఆధారం చేసుకోని తీసాడు. బోర్డు సభ్యుల ఆధిపత్య పోరుతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లోని పరిస్థితులు, ఫిక్సింగ్, ప్లేయర్ల ఎంపిక వంటి వివాదాస్పద విషయాలు, ఆటగాళ్ల వ్యక్తిగత సమస్యలతో కథనాన్ని నడిపాడు. మూడో సీజన్‌లో రోహిత్ అనే టీమిండియా మాజీ కెప్టెన్ పాత్రను గేగా చూపించాడు. స్వలింగ సంపర్కుడు అయిన అతను తన బాయ్ ఫ్రెండ్‌తో రహస్యంగా గడుపుతుంటాడు. బయటకు తెలిస్తే తన స్టార్ ఇమేజీకి డ్యామేజ్ అవుతుందని భయపడుతుంటాడు. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ మాత్రం ప్రపంచానికి పరిచయం చేయాలని ఒత్తిడి తెస్తుంటాడు.
ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి విడిపోతారు. దాంతో రోహిత్ మానసికంగా డిస్టర్బ్ అయి, ఫామ్ కోల్పోతాడు. ఆటపై సరిగ్గా దృష్టిసారించలేకపోతాడు. ఇక తన తప్పిదాన్ని గుర్తించి కీలక మ్యాచ్‌కు ముందు బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి మ్యాచ్‌కు రమ్మని కోరుతాడు. గ్యాలరీలో అతన్ని చూసిన రోహిత్ రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు. ఓటమి అంచున నిలిచిన జట్టును తన సూపర్ బ్యాటింగ్‌తో గెలిపిస్తాడు. దాంతో టీమిండియా సిరీస్ గెలుస్తుంది. ఇక ఈ విజయానంతరం తన బాయ్ ఫ్రెండ్‌ను మైదానంలోనే ముద్దుపెట్టుకొని తాను గే అని అందరికి చాటి చెబుతాడు.
అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీన్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. అనంతరం సిడ్నీ సిక్సర్స్ చేజింగ్‌కు దిగగా అడిలైడ్ కెప్టెన్ పీటర సీడిల్.. డానియల్ వోరల్‌కు బంతినిచ్చాడు. తొలి బంతి వేసిన అనంతరం డానియల్‌కు పలు సూచలను చేసిన సిడిల్..అతని చెంపపై ముద్దిచ్చాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌సైడ్ ఎడ్జ్ మత్తులో ఉన్న భారత అభిమానులు.. ఈ ఇద్దరూ స్వలింగ సంపర్కులు కాదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో డానియల్‌పై సిడిల్‌కు క్రష్ ఉన్నట్లుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చేజింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జోర్డాన్ సిలిక్(36), సీన్ అబాట్(19 నాటౌట్) రాణించారు.