అభిమానులకు పండుగే.. సినిమా థియేటర్లలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు! టికెట్ ధర ఎంతంటే..?

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు శుభవార్త. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు టీవీల్లోనే కాకుండా సినిమా థియేటర్లలోను ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. ఇన్నాళ్లు, బార్లు, రెస్టారెంట్స్, హోటల్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద తెరలపైనే మ్యాచ్‌లను ఆస్వాదించిన అభిమానులు.. ఇక నుంచి థియేటర్లలో ఆ మజాను ఎంజాయ్ చేయనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో మల్టీప్లెక్స్ చైన్ సంస్థలు ఐనాక్స్ లీజర్ లిమిటెడ్, పీవీఆర్ సినిమాస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించాయి. ముందు ఐనాక్స్ ఈ విషయాన్ని వెల్లడించగా.. 24 గంటల వ్యవధిలోనే పీవీఆర్ సినిమాస్ సైతం తాము కూడా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పాయి.

ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో
ఈ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమిండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఐనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే తమ ఉద్దేశమని ఆ కంపెనీ పేర్కొంది.

టికెట్ ధర ఎంతంటే..?
క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్‌కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్‌లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్‌లో మల్టీప్లెక్స్‌లను ప్రారంభించింది.

పీవీఆర్ సినిమాస్
భారత్‌లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నాయి. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌తో తొలి పోరు..
అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications