టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కోహ్లీ ఇంజెక్షన్ కూడా తీసుకున్నారని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే ఈ గాయం నేపథ్యంలో కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతాడా? లేదా? అనేదానిపై సందిగ్దత నెలకొందని పేర్కొన్నాడు.
మరోవైపు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్.. విరాట్ కోహ్లీని రంజీ జట్టుకు ఎంపిక చేసేందుకు సిద్దమవుతోంది. ఒకవేళ అతను ఆడకపోయినా జట్టుతో కలిసి నడుస్తాడని, గాయం నుంచి కోలుకోకుంటే ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం అవుతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కోహ్లీ గాయపడ్డాడనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ జట్టు ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల క్రమశిక్షణగా ఉండాలని 10 కఠిన నిబంధనలను రూపొందించింది. అందులో ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది.
దాంతో భారత సీనియర్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ సెకండ్ ఫేజ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లు ఆయా రాష్ట్రాల తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. రిషభ్ పంత్‌కు ఢిల్లీ కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. గత 13 ఏళ్లుగా అతను దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కోహ్లీ గాయాన్ని పరిగణలోకి తీసుకొని బీసీసీఐ మినహాయింపు ఇస్తుందా? లేక ఆడమని పట్టుబడుతుందా? అనేది చూడాలి. మరోవైపు కోహ్లీ గాయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజంగానే విరాట్ కోహ్లీకి మెడనొప్పి ఉందా? లేక రంజీ ట్రోఫీ ఆడకుండా ఉండేందుకు సాకుగా గాయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడా? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు కోహ్లీ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అంతకు ముందు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఆడే జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే అవకాశం ఉంది.