టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌తో జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు తీవ్ర గాయమైంది. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు.
ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన బంతి హిట్ మ్యాన్ మోచేతికి బలంగా తాకింది. ఈ దెబ్బకు రోహిత్ శర్మ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం నొప్పితోనే బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మరో మూడు రోజుల్లో టీమిండియా కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం ఇదే న్యూయార్క్ వేదికపై పాకిస్థాన్‌తో టీమిండియా హైఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ హోరాహోరీ మ్యాచ్ ముంగిట రోహిత్ శర్మ గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం తన గాయంపై స్పందించిన రోహిత్ శర్మ కాస్త నొప్పిగా ఉందని చెప్పాడు. అతని గాయం తీవ్రతను బట్టి బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స చేయనుంది. గాయం పెద్దది అయితే స్కాన్ చేయనున్నారు. రోహిత్ శర్మ మోచేతిలో క్రాక్ వచ్చినా.. తీవ్ర గాయమైనా రోహిత్ శర్మ జట్టును వీడాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమైతే టీమిండియా కష్టాలు తప్పవు.
అయితే భయపడాల్సిన పనిలేదని, రోహిత్ శర్మ గాయం పెద్దదేం కాదని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు.
అనంతరం లక్ష్యచేధనకు టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ(1), సూర్యకుమార్ యాదవ్(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ తలో వికెట్ తీసారు.