
రోహిత్ శర్మ పోరాడినా..
మెహ్‌దీ హసన్(83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) విరోచిత సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్లా(96 బంతుల్లో 7 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ 148 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసి ఓటమిపాలైంది. శ్రేయస్ అయ్యర్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82), అక్షర్ పటేల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) అర్థ సెంచరీలతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ పోరాడినా విజయం దక్కలేదు.

శుభారంభం లేదు..
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రోహిత్ శర్మకు బదులు ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(5) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎబాదత్ హోస్సెన్ వేసిన ఈ ఓవర్‌లో పుల్ షాట్ ఆడబోయి కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన మరుసటి ఓవర్‌లో శిఖర్ ధావన్(8) ఔటవ్వగా.. వాషింగ్టన్ సుందర్‌ను అప్‌ది ఆర్డర్ ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ బ్యాటింగ్‌కు పంపించింది. కానీ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన సుందర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేసింది.

ఆదుకున్న శ్రేయస్ అయ్యర్..
క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ సెంచరీ హీరో మెహ్‌దీ హసన్ .. రాహుల్(14)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్‌తో శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా శ్రేయస్ అయ్యర్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. తర్వాత 50 బంతుల్లో అక్షర్ అర్థం శతకం అందుకున్నాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మెహ్‌దీ హసన్ విడదీసాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సిరాజ్ జిడ్డు బ్యాటింగ్..
ఆ కొద్ది సేపటికే అక్షర్ పటేల్‌ను ఎబాదత్ హోస్సెన్ ఔట్ చేయగా.. టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చి శార్దూల్ ఠాకూర్ కూడా వెంటనే ఔటవ్వడంతో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు రాక తప్ప లేదు. ఆ కొద్ది సేపటికే దీపక్ చాహర్ కూడా ఔటవ్వడంతో టీమిండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఎబాదత్ హోస్సెన్ వేసిన 46వ ఓవర్‌లో రోహిత్ రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ బౌండరీ కొట్టి ఆశలు రేకెత్తించాడు. కానీ టెయిలండర్ మహమ్మద్ సిరాజ్ నుంచి అతనికి సహకారం లభించలేదు. ముస్తాఫిజుర్ వేసిన 47వ ఓవర్‌లో సిరాజ్ కనీసం సింగిల్ కూడా తీయకుండా మెయిడిన్ చేశాడు.

చెలరేగిన రోహిత్ శర్మ..
మహ్మదుల్లా వేసిన 49వ ఓవర్‌లో రెండు లైఫ్స్‌తో పాటు రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ 20 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. తొలి నాలుగు బంతుల్లో రోహిత్ రెండు బౌండరీలే బాడాడు. దాంతో టీమిండియా విజయానికి చివరి రెండు బంతుల్లో 2 సిక్స్‌లు అవసరమవ్వగా రోహిత్ సిక్స్ బాది ఉత్కంఠగా మార్చాడు. కానీ చివరి బంతి డాట్ అవ్వడంతో బంగ్లా విజయం లాంఛనమైంది.


Click it and Unblock the Notifications
