ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ నమోదు చేసింది. 264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు.
తొలి రోజు ఆటలో తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్.. గాయంతోనే రెండో రోజు బ్యాటింగ్ చేశాడు. జట్టు కోసం ఒంటి కాలితో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 23 పరుగులు.. బుమ్రాతో కలిసి 12 పరుగులు జోడించాడు. నొప్పితోనే విలువైన 35 పరుగులు జట్టుకు అందించాడు. దాంతో భారత్ 350 ప్లస్ మార్క్ అందుకోగలిగింది.

రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఆదిలో గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(20) ఒకే ఒక్క పరుగు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడారు. 6వ వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్(41) స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. మరో వికెట్ పడకుండా పంత్, సుందర్ జాగ్రత్తగా ఆడి తొలి సెషన్‌ను ముగించారు. దాంతో భారత్ 321/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్‌లోనూ పంత్, సుందర్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. అయితే ఈ జోడీని బెన్ స్టోక్స్ విడదీసాడు. వాషింగ్టన్ సుందర్(27)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్(0) కీపర్ క్యాచ్‌గా వెనక్కి పంపాడు. దాంతో భారత్ ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ మాత్రం ఆర్చర్ బౌలింగ్‌లో ఒంటి కాలితోనే భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్‌తో భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్(90) రికార్డ్‌ను పంత్ సమం చేశాడు.
అనంతరం స్టోక్స్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన పంత్.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ తన మరుసటి ఓవర్‌లోనే రిషభ్ పంత్‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఔటై వెనుదిరిగిన రిషభ్ పంత్‌ను ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అభినందించారు. అతని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆఖరి వికెట్‌గా బుమ్రా(4)ను ఆర్చర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.