
మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్ స్మృతి మంధాన(75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 52, లోయరార్డర్ బ్యాటర్స్ పూజా వస్త్రాకర్(48 బంతుల్లో 4 ఫోర్లతో 53 నాటౌట్), స్నేహ్ రానా(59 బంతుల్లో 8 ఫోర్లతో 67), హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు.. పాకిస్థాన్ ముందు 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి మందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. దీప్తి శర్మ(40) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్(5), షెఫాలీ వర్మ(0) తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టగా.. నిదాదర్, నష్రా సంధు రెండేసి వికెట్లు తీసారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0) తన పేలవ ఫామ్‌ను కొనసాగించి తీవ్రంగా నిరాశపరిచింది. డయానా బౌగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన భారత బ్యాటర్లు ఆచితూచి ఆడారు. దాంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇక మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. సంధు బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ కొద్దిసేపటికే స్మృతి మంధాన రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్(1), మిథాలీ రాజ్(9) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో టీమిండియా 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ భారత్‌ను ఆదుకున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.