
క్వీన్స్‌టౌన్: వచ్చేనెలలో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. సూజీ బెట్స్(34 బంతుల్లో 2 ఫోర్లతో 36), కెప్టెన్ సోఫీ డివైన్ (23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. భారత బౌలర్లలో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రాజేశ్వరీ గైక్వాడ్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత మహిళల జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. తెలుగు అమ్మాయి, ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన(30 బంతుల్లో 6 ఫోర్లతో 37) మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్ యాస్తిక భాటియా(26) పర్వాలేదనిపించినా.. షెఫాలీ వర్మ(13), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(12) తీవ్రంగా నిరాశపరిచారు.
67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును తెలుగు అమ్మాయి మేఘన ఆదుకుంది. లీ తహూహు బౌలింగ్‌లో ఆమె క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో భారత పతనం మొదలైంది. లక్ష్యాన్ని అందుకోవాలనే ఆతృతలో భారత్ అమ్మాయిలు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, అమెలియా కెర్ హెలీ జాన్సెన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లీ తహూహు, సోఫీ డివైన్ తలో వికెట్ తీశారు. మేఘన వికెట్ తీసిన లీ తహూహుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక శనివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ 6 మ్యాచ్‌ల సిరీస్ ద్వారా మార్చి-ఏప్రిల్‌లో జరిగే ప్రపంచకప్‌కు ప్రధాన జట్టును ఎంపిక చేస్తామని వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది.