
లండన్: స్మృతి మంధాన(51 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్‌లతో 70) మెరిసినా భారత మహిళలకు ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో స్పూర్తిదాయకమైన పోరాటంతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ సేన.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన సిరీస్ డిసైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 36) బాధ్యాతాయుత ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో రిచా గోష్(13 బంతుల్లో 4 ఫోర్లుతో 20) ధాటిగా ఆడింది. ఇక స్టార్ ఓపెనర్, టీనేజ్ సంచలనం షెఫాలీ వర్మ సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. హర్లీన్ డియోల్(0), స్నేహ్ రాణా(4) తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ మూడు, కేథరిన్ బ్రంట్ రెండు, నాట్ సివర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఇంగ్లండ్ మహిళలు ఆడుతూ పాడుతూ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 రన్స్ చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్ టామీ బీమౌంట్ (11) విఫలమైనా.. డానియల్ వ్యాట్(56 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 89 నాటౌట్), నాట్ సివర్(36 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు.
సూపర్ బ్యాటింగ్‌తో రాణించిన డానియల్ వ్యాట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ ఓటమితో భారత మహిళల ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ఏకైక టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత మహిళలు వన్డే సిరీస్‌ను 1-2, టీ20 సిరీస్‌ను 1-2తో సమర్పించుకున్నారు.