
హోవ్: ఇంగ్లండ్ మహిళలతో ఫస్ట్ టీ20లో ఓడిన భారత మహిళలు జూలు విధిల్చారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి ధాటక జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి అద్భుత విజయాన్నందుకున్నారు. దాంతో మూడు టీ20 సిరీస్‌లో 1-1 లెక్క సరిచేశారు. షెఫాలీ వర్మ(38 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 48) మెరుపు బ్యాటింగ్‌కు.. బౌలర్ల క్రమ శిక్షణ తోడవ్వడంతో రెండో టీ20లో భారత మహిళల జట్టు 8 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. షెఫాలీ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది.
స్మృతి మంధాన(20), షెఫాలీ వర్మ ఫస్ట్ వికెట్‌కు 70 రన్స్ భాగస్వామ్యం చేశారు. కానీ మిడిలార్డర్ బ్యాటర్స్ తగినంత వేగంగా రన్స్ చేయలేకపోవడంతో జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(31)తో పాటు దీప్తీ శర్మ(24 నాటౌట్) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్లలో సివర్, డేవిస్, సారా గ్లెన్, మాడీ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఇంగ్లీష్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసి ఓడింది. ఓపెనర్ బీమాంట్(59), కెప్టెన్ హీథర్‌నైట్(30) టాప్ స్కోరర్లు. దీప్తీ వేసిన 14వ ఓవర్‌లో వీరిద్దరూ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బీమౌంట్ వికెట్ల ముందు దొరికిపోగా.. హీథర్ నైట్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగింది.
అనంతరం భారత మహిళలు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమయ్యాయి. బంతిని అందుకున్న స్నేహ్ రాణా నాలుగు పరుగులే ఇవ్వడంతో భారత విజయం లాంఛనమైంది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్(2/17) రెండు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ, అరుందతీ రెడ్డిలకు తలో వికెట్ దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ బుధవారం జరగనుంది.