INDW vs ENGW: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు డేనియల్ వ్యాట్(47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75), నాట్ సీవర్(53 బంతుల్లో 13 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/27) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్ ఓ వికెట్ పడగొట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే సోఫియా డంక్లీ(1), కాప్సీ(0)లను రేణుకా సింగ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చింది. దాంతో ఇంగ్లండ్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నాట్‌సీవర్‌తో కలిసి డేనియల్ వ్యాట్ దూకుడుగా ఆడింది. ఈ ఇద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పోటాపోటీగా బౌండరీలు బాదారు. దాంతో ఇంగ్లండ్ 11.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసుకుంది. 12వ ఓవర్‌లో సిక్సర్‌తో వ్యాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే నాట్ సీవర్ కూడా అర్తం శతకాన్ని అందుకుంది.

సెంచరీ దిశగా దూసుకెళ్తున్న వ్యాట్‌ను సైకా ఇషాక్ పెవిలియన్ చేర్చింది. హీథర్ నైట్(6)ను పాటిల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్‌లో నాట్ సీవర్ ఔటైనా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.