అంతర్జాతీయ టీ20ల్లో సంచలన రికార్డ్ నమోదైంది. ఇండోనేషియా పేసర్ గేడే ప్రియాందన ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్రను లిఖించాడు. పురుషుల, మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్ల ఫీట్‌ను పలువురు బౌలర్లు సాధించినప్పటికీ ఐదు వికెట్లు తీయడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. లసిత్ మలింగా(శ్రీలంక), రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్), జాసన్ హోల్డర్(వెస్టిండీస్) ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్ల ఫీట్ సాధించారు.
కాంబోడియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 28 ఏళ్ల గేడే ప్రియాందన ఈ అరుదైన ఫీట్ సాధించాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసిన ప్రియాందన.. మరుసటి బంతిని డాట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రియాందన ధాటికి కాంబోడియా బ్యాటర్లు షా అబ్రార్ హుస్సేన్, నిర్మల్‌జిత్ సింగ్, రతనక్, మోంగ్‌దర సోక్, పెల్ వెన్నక్ పెవిలియన్ చేరారు. కాంబోడియా ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రియాందన సంచలన ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 167 పరుగులు చేసింది. అనంతరం కాంబోడియా 106/5 వద్ద నిలవగా.. ప్రియాందన ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారైనా.. దేశవాళీ ఫార్మాట్‌లో మాత్రం ఇప్పటికే ఈ రికార్డ్ నమోదైంది. బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయగా.. సయ్యద్ ముస్తాక్ అలీ (2019-20)ట్రోఫీ సెమీఫైనల్లో భారత ప్లేయర్ అభిమన్యు మిథున్(కర్ణాటక) ఈ రికార్డ్ సాధించాడు.
లసిత్ మలింగ (శ్రీలంక): న్యూజిలాండ్‌పై, 2019లో
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్): ఐర్లాండ్‌పై, 2019లో
కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్): నెదర్లాండ్స్‌పై, 2021లో
జేసన్ హోల్డర్ (వెస్టిండీస్): ఇంగ్లండ్‌పై, 2022లో