అండర్ 19 క్రికెట్‌లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. తొలి అంతర్జాతీయ పర్యటనలోనే అతను అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఇంగ్లండ్ అండర్ 19 జట్టు పతనాన్ని శాసించాడు. ఇండియా అండర్ 19 జట్టుతో ఇటీవల ముగిసిన యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పరుగుల మోత మోగించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 71 సగటు, 174.01 స్ట్రైక్‌రేట్‌తో 355 పరుగులు చేశాడు.
ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా.. రెండో ఓపెనర్‌గా నిలిచాడు. అయితే అడర్ 19 వన్డే క్రికెట్‌లో ఓ సిరీస్‌లో 300 కంటె ఎక్కువ పరుగులతో పాటు అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను బంగ్లాదేశ్ క్రికెటర్ టౌహిడ్ హృదయ్ రికార్డ్‌ను అధిగమించాడు. టౌహిడ్ హృదయ్ 2019లో శ్రీలంకపై 114.62 స్ట్రైక్‌రేట్‌తో 431 పరుగులు చేశాడు. సూర్యవంశీ 174.01 స్ట్రైక్‌రేట్‌తో 355 పరుగులు చేసి ఈ రికార్డ్‌ను అధిగమించాడు.

ఈ సిరీస్‌లో నాలుగో వన్డేలో సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. దాంతో యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించాడు. 2013లో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కమ్రాన్ గులామ్ 53 బంతుల్లో శతకం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ బాది ఈ 12 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు. భారత్ తరఫున రాజ్ అంగద్ బవా.. ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ చేయగా.. వైభవ్ ఈ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేశాడు.
మూడో వన్డేలో 31 బంతుల్లో 86 (277.41 స్ట్రైక్‌రేట్)పరుగులు చేయడం ద్వారా సురేష్ రైనా ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80+ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2004 అండర్ 19 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై సురేష్ రైనా 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ నిలకడైన ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. త్వరలోనే అతను భారత జట్టుకు ఆడుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయుష్ మాత్రే సారథ్యంలో భారత అండర్ 19 జట్టు ఐదు వన్డేల సిరీస్‌ను 3 2తో కైవసం చేసుకుంది.