ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదలు చేసింది. జూన్ 1న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.
జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది. గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా.. ఈ టోర్నీలోనైనా విజేతగా నిలిచి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటోంది. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందరినీ వన్డేలకు పరిమితం చేసిన బీసీసీఐ.. టీ20 ఫార్మాట్‌లో కుర్రాళ్లతో కూడిన జట్టును సిద్దం చేసింది.

ఇప్పుడు సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌ను ఎంపిక చేయడంపై ఫోకస్ పెట్టింది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంతో ఈ ఇద్దరి మెగా టోర్నీ ఆడుతారనే విషయం స్పష్టమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగుతుందనే సంకేతాలను బీసీసీఐ ఇచ్చింది.
ప్రస్తుతం 20 మంది ఆటగాళ్లతో ప్రపంచకప్‌కు టీమ్‌కాంబినేషన్‌ను ఎంపిక చేసే ప్రయత్నం జరగుతోంది. గతేడాదిగా టీ20లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్.. టీ20 ప్రణాళికల్లో లేడనే విషయం స్పష్టమైంది. అయితే మెగా టోర్నీకి ముందు ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో.. టీమిండియా ప్రణాళికలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సత్తా చాటే ఆటగాళ్లకే అవకాశం దక్కనుంది.
వికెట్ కీపర్‌గా ప్రస్తుతం జితేశ్ శర్మకు ప్రాధాన్యత దక్కుతున్నప్పటికీ.. ఐపీఎల్‌లో రిషభ్ పంత్ సత్తా చాటితే అతనే ప్రధాన వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడటం ఖాయం. బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కనుంది.
మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. అఫ్గాన్‌తో సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన శివమ్ దూబేను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజాతో పాటు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కనుంది.
మహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై అతని టీ20 ప్రపంచకప్ భవితవ్యం ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ.. జైస్వాల్ సూపర్ పెర్ఫామెన్స్‌తో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు గల్లంతు అయ్యింది.
టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.