ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆతిథ్య అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన తొలి వన్డేలో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చగా.. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వారిని అనుసరించారు. టాప్-4 బ్యాటర్ల వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
దాంతో అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది. గెలిస్తే సిరీస్‌లో నిలవనుంది. ఓడితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోనుంది. ముఖ్యంగా నాలుగున్నర నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ, రోహిత్‌కు ఈ మ్యాచ్ కీలకం. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును ఈ సిరీస్ దిశానిర్దేశం చేయనుంది.

పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. అడిలైడ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆరంభంలో కాస్త స్వింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. తర్వాత బ్యాటింగ్‌కు ఈజీగా మారుతుంది. బంతి పాతగా మారిన తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఈ కండిషన్స్ నేపథ్యంలోనే టీమిండియా తమ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.
తమ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కు పరిమితమవుతాడు. బ్యాటింగ్ చేయగలడనే కారణంతోనే కుల్దీప్ యాదవ్‌ను కాదని సుందర్‌ను గౌతమ్ గంభీర్ ఆడిస్తున్నాడు. కానీ తొలి వన్డేలో అతను బ్యాటింగ్, బౌలింగ్‌లో నిరాశపర్చాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే ఛాన్స్ లేదు.
తొలి వన్డేలో దారుణంగా విఫలమైనా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ మరోసారి ఓపెనింగ్ చేయనున్నాడు. తనదైన బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత రోహిత్‌పై ఉంది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. తొలి వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన అడిలైడ్‌లో బ్యాట్ ఝులిపించాలి.
శ్రేయస్ అయ్యర్ కూడా మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించాలి. వికెట్ కీపర్‌గా జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా నితీష్ జట్టుకు కావాల్సిన మెరుపులు మెరిపించాడు. జట్టుకు అవసరమైనప్పుడు తన వంతు పాత్ర పోషించాలి.
తొలి వన్డేలో అక్షర్ పటేల్ అటు బ్యాటర్‌గా ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగితే 9వ స్థానంలో ఆడుతాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా హర్షిత్ రాణాతో పాటు మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన బౌలర్లు రెండో వన్డేలో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. యశస్వి జైస్వాల్, ప్రసిధ్ కృష్ణతో పాటు ధ్రువ్ జురెల్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.