ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. టెయిలెండర్స్ జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్)ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. 30 బంతులాడిన సిరాజ్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో దురదృష్టకర రీతిలో ఆఖరి వికెట్‌గా బౌల్డ్ అయ్యాడు. బషీర్ వేసిన బంతిని సిరాజ్ అద్భుతంగా డిఫెన్స్ చేసినప్పటికీ.. బంతి మెల్లిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో సిరాజ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ ఘటన.. 26 ఏళ్ల క్రితం భారత్- పాకిస్థాన్ మధ్య చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లోనూ టీమిండియా.. లార్డ్స్ మ్యాచ్ తరహాలోనే ఆఖరి వరకు పోరాడి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జడేజా తరహాలోనే నాటి మ్యాచ్‌లో సచిన్(136) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. సిరాజ్ తరహాలోనే జవగళ్ శ్రీనాథ్.. సక్లెయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

1999లో చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. రాహుల్ ద్రవిడ్(53), సౌరవ్ గంగూలీ(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 271 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. భారత్ 258 పరుగులకే ఆలౌటైంది. సచిన్ టెండూల్కర్(136) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. విజయానికి 17 పరుగుల దూరంలో సచిన్ 7వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అనిల్ కుంబ్లే(1), సునీల్ జోషి(8), జవగళ్ శ్రీనాథ్(1)లు వెనువెంటనే ఔటవ్వడంతో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అచ్చం సిరాజ్ తరహాలోనే శ్రీనాథ్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో ఔటవ్వడం గమనార్హం.