
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ) ముంబైలోని ఓ హోటల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్న మహిళా క్రికెటర్లు.. గురువారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారు. ఇక సెకండ్ డోస్‌ను పురుషల క్రికెట్లతో సహా ఇంగ్లండ్‌లోనే వేయించుకోనున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు తమ సొంత నగరాల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా.. వేయించుకోని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
'మహిళా క్రికెటర్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇందులో చాలా మంది తమ సొంతనగరాల్లోనే వ్యాక్సీన్ తీసుకున్నారు. వేయించుకోని వారికి గురువారం వ్యాక్సిన్ ఇచ్చాం'అని పేర్కొన్నారు. ఈ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫొటోను మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ట్వీట్ చేసింది. సూదంటే భయమని, కానీ ఈ రోజు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అయిపోయిందని, వీలైనంత త్వరగా ప్రజలంతా వేయించుకోవాలని ట్వీట్ చేసింది.
ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత మహిళల జట్టు జూన్ 16 నుంచి ఏకైక టెస్టులో తలపడనుంది. ఆ తర్వాత రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడతుంది. పురుష క్రికెటర్లతోనే ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టనుంది. మహిళా క్రికెటర్లు బయో బబుల్‌లో క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తమ ఫిట్‌నెస్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు.
బయోబబుల్లో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన జిమ్‌లో క్రికెటర్లంతా చెమటోడ్చారు. తమ సమయాన్ని కొంచెం కూడా వృథా చేయడం లేదు. దేహధారుడ్యాన్ని పెంచుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఆ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. 'షట్ ది నాయిస్' అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.
ఈ వీడియోలో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, జూలన్ గోస్వామి, ఎక్తా బిష్త్ తదితరులు వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ.. బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశారు.