Shaikh Rasheed: ఆ డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొంటాను!

హైదరాబాద్: రికార్డు స్థాయిలో ఐదో సారి అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల చొప్పున క్యాష్ రివార్డు ఇవ్వనుంది. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనుంది. భారత్ విశ్వవిజేతగా నిలవడంలో తెలుగు తేజం, ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు.
అయితే బీసీసీఐ అందించే నగదు పురస్కారంలోని కొంత మొత్తాన్ని తన కుటుంబం కోసం ఓ చిన్న ఇళ్లు కొనేందుకు ఖర్చు చేస్తానని గుంటూరు జిల్లాకు చెందిన 17 ఏళ్ల షేక్ రషీద్ తెలిపాడు. వాస్తవానికి అంత డబ్బును తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. తాజాగా ఓ స్థానిక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఓ ఇల్లు కొంటాను..
‘నేను మ్యాచ్‌లకు వెళ్ళే ప్రతిసారి నాకు ఆర్ధిక ఇబ్బందులుండేవి. డబ్బులు లేక నా కుటుంబం పడ్డ ఇబ్బందులు నాకు బాగా తెలుసు. అయితే చాలా మంది నాకు సహకారమందించారు. ఒక్కసారిగా ఇంత మొత్తం అందుతుందంటే నమ్మబుద్ది కావడంలేదు. వాస్తవానికి అంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు. మాకు ఇప్పటి వరకు చిన్న ఇల్లు కూడా లేదు. కొంత డబ్బు వెచ్చించి మా కుటుంబ సభ్యులకు ఓ చిన్న ఇల్లు కొంటాను. మిగతా డబ్బును నా కెరీర్ కోసం ఖర్చు చేస్తాను.

ఆ రెండు ఇన్నింగ్స్‌లు..
నేను ఈ స్థాయికి రావడానికి ఎందరో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ విజయం నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడం మరువలేనిది. ఈ విజయంతో నాకు స్టార్ ఇమేజ్ వచ్చిందని ఎప్పటికీ అనుకోను. నా జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమయ్యిందో నాకు బాగా తెలుసు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని నా కోచ్‌లు, కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నాను. భవిష్యత్‌లో భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా కృషి చేస్తాను.

కరోనా సోకినా..
అండర్ 19 ప్రపంచకప్‌లో రషీద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఓపెనర్లు విఫలమైన భారత్ చాంపియన్‌గా నిలిచిందంటే.. మూడో స్థానంలో రషీద్.. 4వ స్థానంలో యశ్ ధుల్ (4 మ్యాచ్‌ల్లో 76.33 సగటుతో 229) గొప్పగా రాణించడం వల్లే. సెమీస్‌లో మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ మ్యాచ్‌లో యశ్ శతకం చేయగా.. రషీద్ 94 పరుగులు చేసాడు.

రూ. 10 లక్షలు..
అండర్ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. అతనికి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఇక అండర్ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్ రషీద్.. ఐపీఎల్ మెగా వేలంలో లేకపోవడం గమనార్హం. రిజిస్టర్ చేసుకోలేదా? లేక బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మిస్సయ్యాడా? అనే విషయం తెలియదు. కానీ అతను వేలానికి అందుబాటులో లేడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications