
అదే కథ..
ఈ బలహీనతను ఆయుధంగా మార్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు ఆఫ్ స్టంప్ బయట బంతులేస్తూ భారత్‌ను కట్టడి చేస్తున్నారు. శనివారం ముగిసిన మూడో టెస్టులోనూ ఇంగ్లీష్ బౌలర్లు ఇదే ఫార్మూలాను ఉపయోగించారు. ప్రణాళిక ప్రకారం ఆఫ్ స్టంప్‌కు ఆవల బంతులేసి వికెట్లు సాధించారు. గతంలోనూ మన బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ గడ్డపై ఇలాగే ఔటయ్యారు. అంతెందుకు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇలాగే బంతులను వేటాడి పెవిలియన్ చేరారు.
అయినా ఆ వైఫల్యాల నుంచి పాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారత బ్యాట్స్‌మెన్ ఆట మారుతుందేమోనని అంతా భావించారు. అందుకు తగినట్లుగానే రోహిత్, పుజారా, కోహ్లి మూడో రోజు నిలబడ్డారు. కానీ నాలుగో రోజు వచ్చేసరికి మళ్లీ పాత కథే రిపీట్ అయింది.

రహానే, పుజారా..
పేస్ పిచ్‌లపై బాగా ఆడగలడని పేరున్న సీనియర్ బ్యాట్స్‌మన్ రహానె కూడా ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఔట్ స్వింగర్‌ను ఆఫ్‌స్టంప్ ఆవల అనవసరంగా గెలికి తొలి స్లిప్‌లో రూట్‌కు చిక్కి వెనుదిరిగాడు. రహానే తడబాటుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. చతేశ్వర్ పుజారాదీ ఇదే ఊగిసలాట.
అతను స్లిప్‌లో ఔట్ కావడం తక్కువ. కానీ ఈ సిరీస్‌లో ఎందుకో ఆఫ్‌స్టంప్ లైన్‌లో ఆడడంలో ఇబ్బందిపడుతున్నాడు. సిరీస్‌లో నాలుగుసార్లు స్లిప్ లేదా వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్టంప్ బాల్‌నే అంచనా వేయలేక ఫ్రంట్ లెగ్‌తో ఆపే ప్రయత్నం చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు.

వణికిపోతున్న కోహ్లీ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడలేక తెగ ఇబ్బంది పడుతున్నాడు. 2014 పర్యటనలో ఎంత దారుణంగా విఫలమయ్యాడో మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఆఫ్‌స్టంప్ లోగిలిలో బంతులను ఎదుర్కోవడంలో ఎక్కువ అవస్థపడుతున్న బ్యాట్స్‌మన్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీనే.
తొలి మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆఫ్ స్టంప్‌కు అవతల పడ్డ బంతిని ఆడి కోహ్లీ ఔటయ్యాడంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ బౌలర్లు సైతం కోహ్లీ వైఫల్యాన్నే టార్గెట్ చేస్తూ బంతులు వేస్తున్నారు. ఎంత వదిలేద్దామని ప్రయత్నించినా.. కోహ్లీ వల్ల కావడం లేదు. మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్టంప్ బాల్స్‌కు ఇబ్బంది పడుతూనే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. చివరకు అదే బంతిని వెంటాడి స్లిప్‌లో దొరికిపోయాడు.

రోహిత్ శర్మ మినహా..
స్వింగ్ బాగా ఆడే కేఎల్ రాహుల్‌ది ఇదే పరిస్థితి. అతను ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వెంటాడే వికెట్ పారేసుకున్నాడు. మూడో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇలానే ఔటయ్యాడు. రిషభ్ పంత్, జడేజాలాది ఇదే పరిస్థితి. టెయిలండర్లు కూడా కీపర్ క్యాచ్ లేదా స్లిప్ క్యాచ్‌గానే వెనుదిరిగారు. జట్టులో రోహిత్ శర్మ మినహా అందరూ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు అవస్థపడుతున్నవారే. రోహిత్ ఒక్కడే వాటిని సరిగ్గా అంచనా వేస్తూ వదిలేస్తున్నాడు. అయితే పుల్లర్ షాట్స్ విషయంలో అతను విఫలమవుతున్నాడు. అతని ఫేవరేట్ షాట్‌నే అస్త్రంగా మలుచుకున్న ఇంగ్లండ్ బౌలర్లు ఆ దిశగా టెంప్ట్ చేస్తూ రోహిత్‌ను బోల్తా కొట్టిస్తున్నారు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఇలానే ఎక్కువసార్లు ఔటయ్యాడు.

సచిన్ ఫార్మూలాను అనుసరించాలి..
ఈ వైఫల్యం నుంచి కోహ్లీ బయటపడాలంటే వెంటనే సచిన్‌తో మాట్లాడలని సునీల్ గవాస్కర్ సూచించాడు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ చూపించిన పట్టుదలను కోహ్లీ అందుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో తన తొలి అయిదు ఇన్నింగ్స్‌ల్లో సచిన్ వరుసగా 0, 1, 37, 0, 44 పరుగులు మాత్రమే చేశాడు.
ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. ఆ సమస్యను అధిగమించే దిశగా సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచి 436 బంతులు ఎదుర్కొని అజేయంగా 241 పరుగులు చేసిన అతను.. ఆఫ్‌సైడ్ ఒక్క డ్రైవ్ కూడా ఆడకపోవడం విశేషం. దృఢ సంకల్పంతో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వచ్చిన బంతులన్నింటినీ వదిలేశాడు.
ఇప్పుడు జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా సచిన్ ఫార్ములాను అనుసరించడం అవసరం. సిరీస్ చేజారొద్దంటే ఆఫ్‌స్టంప్ సమస్యను పరిష్కరించుకోవడం అత్యవసరం. నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది.


Click it and Unblock the Notifications
