మాజీ సారథితో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్.. ఈ రోజు రాత్రే!!

హైదరాబాద్: కరోనా దెబ్బకు ఆటల్లేవ్.. వాటికి సంబంధించిన ముచ్చట్లు లేవ్.! ఎక్కడ చూసినా కరోనానే.! యావత్ ప్రపంచమే కరోనాపై యుద్దం చేస్తుంది. పూర్తిగా లాక్‌డౌన్ అయింది. అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఈ కొవిడ్-19 దెబ్బకు క్రీడారంగం పూర్తిగా కుదేలైంది. ఇప్పటికే చాలా టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదాపడ్డాయి. ఇంకొన్ని జరుగుతాయో లేదోననే గందరగోళ స్థితి నెలకొంది. పగలు పప్పు, ఉప్పు కోసం.. రాత్రి మందుల కోసం తప్పా బయటకి రాలేని పరిస్థితి నెలకొంది.దీంతో ఆటగాళ్లంతా ఇంటి పట్టునే ఉంటూ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు తమ వంతు సాయాన్ని అందజేస్తున్నారు. ఇంట్లోనే తాము చేసే చిలిపి పనులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ... ప్రాణాంతక వైరస్ కట్టడికి అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొందరూ చిట్‌చాట్‌లు నిర్వహిస్తూ.. ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

ఇంటర్వ్యూయర్‌గా పీటర్సన్
ఇక ఆటగాళ్లకు బోలెడంత సమయం ఉన్నా.. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ వినూత్న కార్యక్రమానికి తెరదిశాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ వేదికగా స్టార్ ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేస్తూ.. ఆసక్తికర విషయాలను రాబడుతూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇటీవలే రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేసిన ఈ ఇంగ్లండ్ మాజీ సారథి.. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ముచ్చటించనున్నాడు. గురువారం (ఏప్రిల్ 2) సాయంత్ర 7 గంటలకు పీటర్సన్-కోహ్లీ లైవ్ సెషన్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని భారత సారథే బుధవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
స్టే ట్యూన్.. కోహ్లీ ట్వీట్..
‘రేపు(గురువారం) రాత్రి 7 గంటలకు నా ఫ్రెండ్ కెవిన్ పీటర్సన్, నేను ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రానున్నాం. ఈ లైవ్ సెషన్‌లో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో పాటు మాకు తెలిసిన క్రికెట్ ముచ్చట్లపై చర్చించనున్నాం. మాతో చర్చలో పాల్గొనడానికి సిద్దంగా ఉండండి'అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ లైవ్ సెషన్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ లైవ్ సెషన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. క్రికెట్‌కు సంబంధించిన విషయాలు.. ముఖ్యంగా ఆర్సీబీ టీమ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలవనున్నాయి. ఎందుకంటే పీటర్సన్ కూడా ఒకప్పటి ఆర్సీబీ ప్లేయరేనన్న విషయం తెలిసిందే.

రోహిత్‌తో సూపర్ సెషన్
ఇటీవల రోహిత్‌తో జరిగిన చాట్ సెషన్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. అభిమానులకు కావాల్సిన చాలా ప్రశ్నలకు పీటర్సన్ హిట్‌మ్యాన్ సమాధానం రాబట్టాడు. ముఖ్యంగా తన కెరీర్‌లో అత్యంతగా బాధపడిన సందర్భం 2011 వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక కాకపోవడమేనని, అది కూడా తన చెత్త ప్రదర్శనవల్లేనని రోహిత్ తెలపడం.. ఇళ్లు శుభ్రం చేయడం చాలా కష్టమని, పరిస్థితులు సర్దుకుంటే ఐపీఎల్ జరుగుతుందనే సమాధానాలు తీవ్రచర్చనీయాంశమయ్యాయి.

విరుష్క రూ.3 కోట్ల సాయం..
ఇక కరోనా కట్టడికి కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేసినట్లు తెలిపారు. అయితే ఎంతా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వారి సన్నిహిత వర్గాలు మాత్రం విరుష్క జోడీ రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఇక హిట్ మ్యాన్ కూడా రూ.80 లక్షల సాయాన్ని అందజేశాడు. సచిన్, గంగూలీ రూ.50 లక్షలు.. బీసీసీఐ రూ.51 కోట్ల సాయాన్ని ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications