కెప్టెన్‌గా కోహ్లీ ప్రవర్తన బాలేదు.. జై షాకు జట్టులోని సీనియర్ ప్లేయర్ ఫిర్యాదు!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. వర్క్ లోడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసాడు. అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయానికి గల కారణాలు తెలియకపోయినా.. అనేక ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. సెలెక్టర్ల ముందు అతను పెట్టిన కొన్ని ప్రతిపాదనలు, బ్యాటింగ్ వైఫల్యంతో అతని ప్రవర్తనలో వచ్చిన మార్పులు బెడిసికొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని, వన్డేల్లో కేఎల్ రాహుల్, టీ20ల్లో రిషభ్ పంత్‌లకు అవకాశాలివ్వాలని సెలెక్టర్లను విరాట్ కోహ్లీ కోరాడని కథనాలు వెలువడ్డాయి. తాజాగా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రవర్తన బాలేదని జట్టులోని ఓ సీనియర్ ఆటగాడు బీసీసీఐ సెక్రటరీ జై షాకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు 'ది టెలిగ్రాఫ్' ఓ కథనాన్ని ప్రచురించింది.

బీసీసీఐకి మేలు..
కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ముందుగానే చెప్పి కోహ్లీ.. బీసీసీఐ పనిని సులువు చేశాడని పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని, సహచర ఆటగాళ్లు, కోచ్‌ల పట్ల అతని వైఖరి ఇబ్బందికరంగా మారిందని ఓ సీనియర్ ప్లేయర్ బీసీసీఐ సెక్రటరీ జై షా దృషికి తీసుకొచ్చాడని, దాంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన రంగంలోకి దిగాడని బోర్డుకు చెందిన ఓ అధికారి తమకు తెలిపినట్లు టెలిగ్రాఫ్ తమ కథనంలో రాసుకొచ్చింది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలను పసిగట్టిన కోహ్లీ ముందుగానే తన నిర్ణయాన్ని వెల్లడించాడని పేర్కొంది.

కోహ్లీ అనుచిత ప్రవర్తన..
'కోహ్లీ సహనం కోల్పోతున్నాడు. కొంతమంది సీనియర్ ప్లేయర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి తన గౌరవాన్ని కూడా తగ్గించుకున్నాడు. అతను ఏ మాత్రం స్పూర్తిదాయకమైన సారథి కాదు. ఆటగాళ్ల నుంచి మళ్లీ అతను గౌరవాన్ని పొందలేడు. అతనితో మాట్లాడే విషయంలో కొందరు హద్దులు ధాటాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. బ్యాటింగ్ వైఫల్యం కోహ్లీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అయింది. ఆ ఫ్రస్టేషన్‌లో అతను కోచ్‌లతో పాటు ఆటగాళ్లపై అరుస్తున్నాడు. నెట్ సెషన్‌లో ఓ కోచ్ అతనికి సలహా ఇచ్చే ప్రయత్నం చేయగా.. గట్టిగా మందలించాడు. అనవసర సలహాలతో తనను అయోమయానికి గురి చేయవద్దన్నాడు. వరుస వైఫల్యాలను అధిగమించడంలో విఫలమవుతున్న కోహ్లీ.. ఆ ఫ్రస్టేషన్‌తో కోపాద్రిక్తుడవుతున్నాడు.'అని ఓ సీనియర్ ప్లేయర్.. జైషా దృష్టికి తీసుకొచ్చాడని సదరు అధికారి పేర్కొన్నాడు. అయితే ఆ ఆటగాడు ఎవరా? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

అందుకే ధోనీ మెంటార్‌గా..
దాంతో కోహ్లీపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగిందని, ఈ క్రమంలోనే అతన్ని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలనుకుందని చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మెగా టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసిందన్నాడు. గేమ్ ప్లాన్ ధోనీ చూసుకుంటే.. కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలడని బీసీసీఐ భావించిందని చెప్పుకొచ్చాడు.
'రోహిత్ శర్మ చాలా కూల్‌గా ఉంటాడు. అజింక్యా రహానై సైతం ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్‌గా సత్తా చాటాడు. రోహిత్‌ను ఓ అన్నలా యువ ఆటగాళ్లు ట్రీట్ చేస్తారు. కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చే మార్పులతో కోహ్లీ అధికారం తగ్గించడం ఖాయం. విరాట్ పవర్స్ మొత్తం క్షీణిస్తున్నాయి. ఇక అతని ప్రతీ మూమెంట్ ప్రశ్నార్థకంగా మారుతుంది. కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదు. కానీ అతని కెప్టెన్సీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందనేది వాస్తవం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.

వన్డే సారథ్య బాధ్యతలు కూడా..
కోహ్లీ టీ20 కెప్టెన్సీ మాత్రమే వదులు కోవడంతో రోహిత్ శర్మకు ఆ ఒక్క ఫార్మాట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలా? లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ మొత్తానికి కెప్టెన్‌ను చేయాలా? అనే విషయాన్ని బీసీసీఐ తేల్చుకోలేకపోతుంది. దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ గెలవకపోతే మాత్రం కోహ్లీ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకునే పరిస్థితి రానుంది. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గెలిస్తే మాత్రం.. వన్డే సారథ్య బాధ్యతలు కూడా అతనికివ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కనీసం ఒక్కదానికైన కెప్టెన్‌గా ఉండాలని కోహ్లీ భావిస్తున్నాడని, లేకుంటే మార్కెట్‌లో తన బ్రాండ్ వాల్యూ తగ్గుతుందేమోనని భయపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే కోహ్లీ కెప్టెన్‌గా వైదొలిగినా అతని మార్కెట్ విలువలో ఎలాంటి మార్పు రాదని బిజినెస్ వర్గాలు అంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications