WTC Final అఫిషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో ఆ ఐరెన్ లెగ్ అంపైర్.. కానీ!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. జూన్ 18 నుంచి 22 వరకు ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్ పోరులో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్, విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఎలైట్ ప్యానెల్‌లోని రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్‌లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోని రిచర్డ్ కెటిల్ బరోను టీవీ అంపైర్‌గా.. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్‌కు చెందిన అలెక్స్ వార్ఫ్ నాలుగో అంపైర్‌గా సేవలందించనున్నారు.
టాప్ అఫిషియల్స్..
ఈ మేరకు ఐసీసీ సీనియర్ మేనేజర్(అంపైర్స్, రిఫరీల) అడ్రైన్ గ్రిఫ్ఫిత్ మ్యాచ్ అఫిషియల్స్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేశాడు. అంతేకాకుండా కరోనా కారణంగా ఈ మ్యాచ్‌కు టాప్ అఫిషియల్స్ సేవలు అందుతున్నాయని తెలిపాడు. 'ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం అత్యంత అనుభవం కలిగిన మ్యాచ్ అఫిషియల్స్‌తో కూడిన జాబితాను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ విపత్కర కాలంలో ఇదంతా సులువు కాదు. కానీ కరోనా కారణంగా ఇతర మ్యాచ్‌లు లేకపోవడంతో టాప్ అఫిషియల్స్ సేవలు ఈ మ్యాచ్‌కు దక్కుతున్నాయి.'అని గ్రిఫ్పిత్ చెప్పుకొచ్చాడు.

జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్..
ఐసీసీ ప్రకటించిన ఈ అఫిషియల్స్ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో పేరు చూసి భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దాంతోనే అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని ఇండియన్ ఫ్యాన్స్ ఐసీసీకి రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది.

అయ్యో ఎక్స్‌ప్రెషన్..
ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 95 పరుగులతో చిత్తుగా ఓడి ఇంటిదారిపట్టింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కెటిల్ బరో ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగులతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్ బరో.. 'అయ్యో' అని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను భారత అభిమానులు ఇంకా మరిచిపోలేదు.

సానుకూల విషయం ఏంటంటే..
ఇప్పటి వరకు భారత్ ఓడిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో కెటిల్ బరో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించాడని, కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం టీవీ అంపైర్‌గా వ్యవహరించనున్నాడని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమేనని, ఐరెన్ లెగ్ అంపైర్ ఉన్నా.. ఏం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంపైర్ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా మరోసారి హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం సౌతాంప్టన్ వేదికగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో టీమిండియా సమాయత్తం అవుతోంది. మరోవైపు న్యూజిలాండ్ ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో సన్నదం అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications