ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌కు సెమీస్ చేరే సీన్ లేదన్న అమీర్.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాత్రమే ముందడుగు వేస్తాయని జోస్యం చెప్పాడు.
పాకిస్థాన్‌తో మినహా అన్ని మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని, ఓపెనర్ అభిషేక్ శర్మ గాలిగాడని, గుడ్డిగా బ్యాట్ ఊపుతాడని విమర్శలు గుప్పించాడు. అభిషేక్ బ్యాటింగ్‌లో టెక్నిక్ లేదని, ఆఫ్ సైడ్ గేమ్ మెరుగుపరుచుకోకపోతే అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కష్టమని సూచించాడు. జింబాబ్వేతో భారత్ ఓడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు.

అయితే జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో మహ్మద్ అమీర్‌పై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ గాలిగాడా? పవర్ ఫుల్ బ్యాటర్ అనే విషయం తెలిసిందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మహమ్మద్ అమీర్ గాడి ముఖ చిత్రం ఏంటో..?అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వెస్టిండీస్‌ను కూడా ఓడించి భారత్ సెమీస్ చేరుతుందని, అప్పుడు నీ పని చెబుతామని అమీర్‌ను హెచ్చరిస్తున్నారు.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం మహమ్మద్ అమీర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. అభిషేక్ శర్మ గాలి గాడు కాదని, అతనిది అసూయ పడే బ్యాట్ స్వింగ్ అని అశ్విన్ స్పష్టం చేశాడు. అతని మెంటార్ యువరాజ్ సింగ్ కంటే కూడా అభిషేక్ శర్మ బ్యాట్ స్వింగ్ మెరుగ్గా ఉంటుందన్నాడు. అతను బంతిని బాదితే చాలా దూరం వెళ్తుందన్నాడు. ప్రతీ బంతిని బాదడం అతని తప్పేనని, కానీ అతను స్లాగర్ మాత్రం కాదని అమీర్‌కు చురకలంటించాడు.