
బెంగళూరు: భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ ఓ వివాదంలో చిక్కుకుంది. చిల్లర గొడవతో తన పేరును అప్రతిష్టపాలు చేసుకుంది. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి గైక్వాడ్.. ఓ సూపర్ మార్కెట్‌పై తన మనషులతో దాడి చేసి వార్తల్లో నిలిచింది. సూపర్ మార్కెట్ సిబ్బందిని ఆమె మనషులు కొట్టిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
తాను నివాసం ఉండే కాలనీలోని ఓ సూపర్ మార్కెట్ సిబ్బందితో రాజేశ్వరీ గైక్వాడ్ ఏదో విషయమై గొడవపడింది. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆమె.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత మరికొంత మంది మనుషులతో కలిసి వచ్చి సూపర్ మార్కెట్ సిబ్బందిపై దాడి చేసింది.
సూపర్ మార్కెట్ నిర్వాహకులు సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేసినా.. ఇరు వర్గాలు సమస్యను పరిష్కరించడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు.స్వల్పంగా గాయపడిన సిబ్బందికి రాజేశ్వరి గైక్వాడ్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగిన ప్రాంతానికి వేరే వైపు సీసీటీవీ ఉండడంతో సూపర్ మార్కెట్ సిబ్బందిపై ఎవరు దాడి చేసింది? ఎంత మంది వచ్చారనే వివరాలు మాత్రం వీడియోలో కనిపించడం లేదు.
దాడి చేసిన వైపు సీసీటీవీ కెమెరాలు లేవా? ఉన్నా పనిచేయడం లేదా? లేక పని చేస్తున్నా ఆ ఫుటేజీని డిలీట్ చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ గొడవపై క్లారిటీ లేకున్నా.. చిల్లర గొడవతో రాజేశ్వరి గైక్వాడ్ అప్రతిష్టపాలైంది. అయితే ఈ ఘటనపై ఆమె ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
2014 జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజేశ్వరి గైక్వాడ్.. ఇప్పటిదాకా భారత్ తరుపున 2 టెస్టులు, 64 వన్డేలు, 44 టీ20 మ్యాచులు ఆడింది. వన్డేల్లో 99 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, 44 టీ20 మ్యాచుల్లో 54 వికెట్లు తీసింది. టెస్టుల్లో 5 వికెట్లు తీసింది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 158 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, 2022 వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది.