తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన ఘనత..!

లక్నో: భారత మహిళా క్రికెటర్, వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగుల మైలు రాయిని అందుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన గుర్తింపును అందుకుంది. అంతేకాకుండా ఓవరాల్‌గా 10 వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా మహిళలతో లక్నో వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ( 50 బంతుల్లో 4 ఫోర్లతో 36) పరుగులు చేసి అన్నేబాష్ బౌలింగ్‌లో ఔటైంది. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకుంది.
22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్..
ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా సారథి అన్ని ఫార్మాట్లలో కలిపి 9,965 పరుగులు చేశారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ సుదీర్ఘకాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆమె 10 మ్యాచ్‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలీ 6,974 పరుగులు చేసింది. అందులో ఏడు సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు టీ20 క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడగా 2,364 పరుగులు సాధించింది. ఈ ఫార్మాట్‌లో 17 హాఫ్ సెంచరీలు కొట్టింది.

ప్రపంచకప్ లక్ష్యంగా..
ప్రస్తుతం టీ20, టెస్టులకు దూరమైన మిథాలీ.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. తర్వాతీ ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాలని కలలుకంటున్నారు. ఇప్పటికే రెండు ప్రపంచకప్‌ల్లో ఫైనల్ వరకు తీసుకెళ్లి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే నేడు కొత్త చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ 10,273 పరుగులతో తొలి స్థానంలో నిలవగా, మిథాలీ రాజ్ 10,001 పరుగులతో రెండో స్థానంలో ఉంది. ఆపై న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(7,849), వెస్టిండీస్ బ్యాటర్ స్టిఫానీ టేలర్(7,816), ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ (6,900) పరుగులతో వరుసగా ఉన్నారు.

భారత్ 248/5
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 248 పరుగులు చేశారు. భారత జట్టులో ఓపెనర్లు జెమీమా(0), స్మృతి మంధాన(25) విఫలమవ్వగా.. పూనమ్ రౌత్(77), మిథాలీ రాజ్(36) ఫర్వాలేదనిపించారు. పూనమ్‌తో కలిసి మిథాలీ మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన హార్మన్ ప్రీత్ కౌర్(36), దీప్తీ శర్మ(36) పర్వాలేదనిపించాడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా మహిళలు.. 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే చెరొకటి గెలిచిన ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications