Shoaib Akhtar: పాక్ చేతిలో ఓడినా.. భారత్ ఫైనల్ చేరుతుంది! దాయాదుల మధ్యే టైటిల్ ఫైట్!

దుబాయ్: చరిత్ర మనవైపే ఉంది.. బలాబలాల్లో మనదే పైచేయి.. వామప్ మ్యాచ్‌ల్లో మనోళ్ల ఊపు మామూలుగా లేదు..! పేపర్‌పై ఎలా చూసినా టీమిండియా కంటే పాకిస్థానే బలహీనంగా కనిపించింది. సానుకూలతలన్నీ మనకే.. ప్రతికూలతలన్నీ వాళ్ల వైపే! ఈ మ్యాచ్‌లో ఓటమి గురించిన ఆలోచనే లేదు భారత అభిమానులెవ్వరికీ..! గెలవడం కంటే ఎలా గెలుస్తాం.. ఎంత తేడాతో గెలుస్తాం.. పాకిస్థాన్‌కు మరోసారి ఎంత వేదన మిగులుస్తాం అన్న లెక్కల్లోనే ఉన్నారంతా! ఎప్పట్లా మ్యాచ్ తర్వాతసంబరాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి.
ఆట ఆరంభమయ్యే వరకు విజయానికి టీమిండియా ఎంతో దగ్గరగా.. పాకిస్థాన్ చాలా దూరంలో కనిపించాయి. కానీ ఆదివారం ఆ లెక్కలన్నీ మారిపోయాయి. రోహిత్ శర్మ డకౌట్‌తో మొదలైన పతనం చివరకు ఓటమి వరకు సాగింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి మెగాటోర్నీలో బోణీ కొట్టింది.

ఫైనల్లో మళ్లీ భారత్-పాక్..
ఈ ఫలితంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ ఓడిపోవడంతోనే భారత్ సగం మ్యాచ్ కోల్పోయిందన్నాడు. ఇక భారత మీడియా అతి చేయడం కూడా ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి నెలకొల్పిందని అభిప్రాయపడ్డాడు. పాక్ చేతిలో ఓడినా భారత్ ఫైనల్ చేరగలదనే నమ్మకం తనకు ఉందని, టైటిల్ ఫైట్‌లో మళ్లీ భారత్-పాక్ తలపడాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. 'ఇది టోర్నీ ఆరంభం మాత్రమే. ఇప్పటికీ ఇండియా ఫైనల్ చేరగలదనే నమ్మకం నాకు ఉంది. అయితే ఫైనల్ చేరే ప్రయాణం టీమిండియాకు కఠినంగా మారింది.భారత ఆటగాళ్లు ఒత్తిడికి చిత్తయ్యారు. అంతమాత్రాన వారిని అభిమానులు తిట్టాల్సిన పనిలేదు. తమ స్టార్ ఆటగాళ్ల పట్ల విధ్వేషం కనబర్చాల్సాని పనిలేదు. అది మంచిది కూడా కాదు. ఇండియా ఇప్పటికీ ఫైనల్ చేరగలదు. ఫైనల్లో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నా.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

‘మంచు' ముంచింది..
మ్యాచ్ ఫలితంపై స్పందిస్తూ...'టాస్ ఓడినప్పుడే భారత్ సగం మ్యాచ్ కోల్పోయింది. మ్యాచ్‌లో 'మంచు' కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బౌలర్ల అవకాశాలను దెబ్బతీసింది. మంచు ఉన్నప్పుడు బంతి బౌలర్లకు పట్టుచిక్కదు. అంతేకాకుండా అటు స్వింగ్, ఇటు స్పిన్ అవ్వదు. టాస్ గెలిచిన పాకిస్థాన్‌కు ఈ విషయంలో అడ్వాంటేజ్ లభించింది. ఆరంభంలో వికెట్ స్పిన్, స్వింగ్‌కు అనుకూలించడంతో పాక్ బౌలర్లు చెలరేగారు. వరుస వికెట్లు తీసి భారత్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఇక మంచు కారణంగానే భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్ విషయంలో మీడియా సైతం అతిగా ప్రవర్తించింది. ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి నెలకొల్పింది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రతీ ఒక్కరి వారి వారి ఎజెండాలతో జట్టుకు అవాస్తవ ప్రమాణాలను సెట్ చేశారు. పాకిస్థాన్ చేతిలో ఓడితే నేరమన్నట్లుగా పరిస్థితులను క్రియేట్ చేశారు. కానీ ఇది క్రికెట్ గేమ్. మ్యాచ్ అన్నప్పుడు విన్నర్‌తో పాటు లూజర్ కూడా ఉంటాడు.'అని అక్తర్ పేర్కొన్నాడు.

కోహ్లీ, పంత్ మినహా..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాహిన్ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications