India vs Zimbabwe పసలేదు.. పట్టించుకునెటోడు లేడు! వ్యూయర్‌షిప్ ఢమాల్!

హైదరాబాద్: జింబాబ్వే గడ్డపై టీమిండియా శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన ఏక పక్ష మ్యాచ్‌లో టీమిండియా ఆడుతూ పాడుతూ సునాయసంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. ఒకరకంగా ఈ మ్యాచ్ వారికి చికాకును తెప్పించింది. ఏ మాత్రం పసలేకుండా సాగిన మ్యాచ్ తీవ్ర బోర్ కొట్టించింది. మ్యాచ్ చూడటం ఆపేసి ఇతర పనులు చేసుకునేంత చప్పగా ఈ మ్యాచ్ సాగింది. అయితే జింబాబ్వే సామర్థ్యం ఇంతే కాబట్టి ఆ జట్టు నుంచి ఇంకా ఎక్కువ ఆశించలేం. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌పై ఆ జట్టు సత్తా చాటడంతో భారత్‌కు గట్టిపోటీనిస్తుందని అంతా భావించారు.

పసలేని బ్యాటింగ్..
పైగా స్టార్ ఆటగాళ్లంతా ఈ సిరీస్‌కు దూరంగా ఉండటం, ద్వితీయ శ్రేణి జట్టుతో భారత్ ఆడుతున్న నేపథ్యంలో పోటీ రసవత్తరంగా ఉంటుందని భావించారు. కానీ వారి ఆశలపై ఇరు జట్ల ఆటగాళ్లు నీళ్లు జల్లారు. జింబాబ్వే ఆటగాళ్లే అంటే వారికంటే ఎక్కువ భారత ఆటగాళ్లు విసుగు తెప్పించారు. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీసుకోకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫీల్డింగ్ టీమ్‌కు అడ్వాంటేజ్ ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ బలహీనమైన ప్రత్యర్థిపై కూడా ఇలా జాగ్రత్త పడటం ఏంటో అర్థం కాలేదు. ఆసియా కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ భారత్ సునాయసంగా గెలుస్తుందని అందరికి తెలుసు.

పరమ బోరింగ్..
అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం ఎంతవరకు సమంజసం. ఈ మధ్య టీమ్ అప్రోచ్ మారిందని, దూకుడే మంత్రంగా జట్టు ముందుకు సాగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పదే పదే చెప్పారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం ఆ దూకుడు కనిపించలేదు. స్వల్ప లక్ష్యాన్నిచేధించే క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ చాలా నెమ్మదిగా ఆడారు. వ్యక్తిగత పరుగుల కోసమే బ్యాటింగ్ చేసినట్లు అనిపించింది. అభిమానులను అలరించాలనే ఉద్దేశం వారిలో కనిపించలేదు. అసలే వన్డే క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఇలాంటి మ్యాచ్‌లు అభిమానులను ఈ ఫార్మాట్ మరింత దూరం చేస్తున్నాయి.
ఏకపక్ష విజయాలతో విసిగిపోయిన ఫ్యాన్స్..
ఈ సిరీస్‌కు ముందు వెస్టిండీస్ పర్యటనలోనూ ఇలానే ఏకపక్ష విజయాలు దక్కాయి. అయితే కొన్ని మ్యాచ్‌లు మాత్రం హోరాహోరీగా సాగాయి. కానీ మ్యాచ్‌ల టైమింగ్స్ భారత కాలమానానికి విరుద్దంగా ఉండటంతో ఆ పర్యటనకు పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. ఇప్పుడేమో ఇలాంటి చెత్త ప్రదర్శన అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గత మూడు నెలలుగా టీమిండియా అభిమానులు అసలు సిసలు మ్యాచ్‌ను చూడలేకపోతున్నారు. మళ్లీ ఆసియాకప్‌తోనే అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. తొలి మ్యాచ్‌లోనే దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ ఆడనుంది. ఆ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం భారత అభిమానులు వేచి చూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications