
హరారే: జింబాబ్వే గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. మ్యాచ్ మారినా జింబాబ్వే బ్యాటర్ల ఆట తీరు మాత్రం మారడంలేదు. భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆ జట్టు కుప్పకూలింది. దీపక్ చాహర్ స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (3/38)కు అండగా ఇతర బౌలర్లు తలో వికెట్‌తో రాణించడంతో జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు పరారయ్యారు. ఆ జట్టులో సీన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కైటనో(7)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో ఇన్నోసెంట్ కియా(16), చకబ్వా(2) క్యాచ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో వెస్లీ(2)ని ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చడంతో 31 పరుగులకే జింబాబ్వే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజా(16), సీన్ విలియమ్స్(42) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ కుల్దీప్ యాదవ్ దెబ్బతీసాడు.
సికిందర్ రాజా(16)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికీ దీపక్ హుడా.. క్రీజులో సెట్ అయిన సీన్ విలియమ్స్‌ను పెవిలియన్ చేర్చాడు. దాంతో జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఓవైపు ర్యాన్ బర్ల్(39 నాటౌట్) పోరాడినా మరోవైపు లూక్(6), డ్రాడ్, విక్టర్(0), తనక(4) పెవిలియన్ చేరారు. దాంతో జింబాబ్వే 161 పరుగులకు కుప్పకూలింది.
162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అప్పుడే ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(12 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(4 బ్యాటింగ్) ఉన్నారు.