
కోహ్లీ ఓ బ్రాండ్..
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.. విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి. నిలకడలేమి ఫామ్‌తో బాధపడుతున్న కోహ్లీని భారత జట్టు నుంచి బీసీసీఐ తప్పించలేదని, అతను భారత్‌కే కాదు అంతర్జాతీయ క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడరని తెలిపాడు. కోహ్లీని పక్కనపెట్టడం వల్ల బీసీసీఐకే కాకుండా ఐసీసీతో పాటు ఇతర క్రికెట్ బోర్డులకు కోట్లలో నష్టం వస్తుందని చెప్పాడు. ఈ కారణంతోనే కోహ్లీని పక్కనపెట్టే సాహసం బీసీసీఐ చేయలేకపోతుందని స్పష్టం చేశాడు.

కోహ్లీ లేకుంటే కోట్లలో నష్టం..
'విరాట్ కోహ్లీ ఓ ప్లేయర్ మాత్రమే కాదు. ఓ బ్రాండ్... ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీకి మాత్రమే జనాల్లో అంతటి పాపులారిటీ దక్కింది. విరాట్ కోహ్లీ టీవీ మీద కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ దేశాల్లోనూ విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. కేవలం బీసీసీఐ మాత్రమే కాదు మిగిలిన క్రికెట్ బోర్డులు కూడా విరాట్ కోహ్లీ పేరు చెప్పి చాలా సంపాదించుకున్నాయి. అతన్ని చూపించి స్పాన్సర్లను రాబట్టుకున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆర్థికంగా క్రికెట్‌కు ఎంతో అవసరం.'అంటూ పనేసర్ చెప్పుకొచ్చాడు.

విండీస్ అలసత్వం..
టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనతో ఈ విషయం స్పష్టమైంది. ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఆటకు సుదీర్ఘ బ్రేక్ ప్రకటించాడు. విండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండాలని భావించిన కోహ్లీ.. ఫ్యామిలీతో లండన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటీవలే భారత్‌కు చేరిన అతను ఆసియా కప్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే కోహ్లీ లేకపోయినా రోహిత్ రాకతో టీ20 సిరీస్‌కు ఆదరణ లభిస్తుందని భావించిన ఇరు దేశాల బోర్డు అధికారులకు నిరాశే ఎదురైంది. కోహ్లీ గైర్హాజరీకి తోడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అలసత్వం కాస్తో కూస్తో చూసే అభిమానులను దూరం చేసింది. లగేజి ఆలస్యం అవ్వడం వల్ల రెండు, మూడు టీ20 ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దాంతో భారత అభిమానులు ఈ సిరీస్‌ను లైట్ తీసుకున్నారు.

లైట్ తీసుకున్న ఫ్యాన్స్..
ఈ పరిస్థితులను ముందే పసిగట్టిన స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కొనుగోలు చేయకుండా దూరంగా ఉన్నాయి. దాంతో ఫ్యాన్ కోడ్ మాత్రమే డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. చేసేదేం లేక భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్ ఈ మ్యాచ్‌లను ప్రసారం చేస్తోంది. లేట్ నైట్ వచ్చే ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు నిద్రను పాడు చేసుకోని రిస్క్ చేయడం లేదు. వరుసగా తీరిక లేని షెడ్యూల్‌తో మ్యాచ్‌లు జరగడం కూడా అభిమానులకు బోర్ కొట్టింది. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఈ పర్యటనను లైట్ తీసుకున్నారు. ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్స్ ఆఫర్ పెట్టినా అభిమానులు ఆసక్తి చూపడం లేదు.


Click it and Unblock the Notifications












