
ప్లోరిడా: రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం పోనట్టుంది టీమిండియా అభిమానుల పరిస్థితి. వెస్టిండీస్ నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు వచ్చినా మ్యాచ్‌లకు అంతరాయం తప్పడం లేదు. వెస్టిండీస్ గడ్డపై వన్డే సిరీస్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే.. ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా టీ20 సిరీస్ డిస్టర్బ్ అయ్యింది. టీమ్ లగేజీ టైమ్‌కు రాలేదనే సిల్లీ రీజన్‌తో రెండు, మూడో టీ20 మ్యాచ్‌లు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమై అభిమానులను చికాకుకు గురిచేసింది. అమెరికాలోనైనా సజావుగా మ్యాచ్‌లు జరగుతాయని భావించిన అభిమానులకు వరణుడు షాకిచ్చాడు.
నాలుగో టీ20కి అంతరాయం కలిగిస్తున్నాడు. దాంతో ఇంకా టాస్ వేయలేదు. మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను వన్డేల్లో, టీ20ల్లో మట్టి కరిపించి వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన టీమిండియా.. ఇప్పటికే అక్కడ వన్డే సిరీస్ గెలిచేసింది. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసి, 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక పొట్టి క్రికెట్లోనూ సిరీస్ అందుకోవడమే మిగిలింది.
ఆ లక్ష్యంతోనే తాజా నాలుగో టీ20లో బరిలోకి దిగుతోంది. రెండో టీ20లో తడబడ్డా వెంటనే పుంజుకుని విండీస్‌పై ఘనవిజయం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మూడో టీ20లో నడుం దగ్గర కండరాలు పట్టేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్ కోలుకున్నాడని, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాల సమాచారం. రోహిత్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, కార్తీక్ మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
మూడో స్థానంలో ఆడుతున్న శ్రేయస్ సత్తా చాటకపోవడం ఒక్కటే సమస్యే. గత మ్యాచ్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడాకు ఈసారి ఎక్కువ సమయం క్రీజులో గడిపే అవకాశం వస్తుందేమో చూడాలి. బౌలింగ్‌లో భువనేశ్వర్, అర్ష్‌దీప్ సత్తా చాటుతున్నారు. అవేష్ ఖాన్ విఫలమవుతున్న నేపథ్యంలో అశ్విన్‌కు తోడుగా మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశలున్నాయి.
ఈ మ్యాచ్ ఓడితే వరుసగా రెండో సిరీస్ కూడా చేజారే స్థితిలో ఉన్న విండీస్ గట్టిగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. మేయర్స్, కింగ్, పూరన్, పావెల్, హెట్‌మయర్‌లతో బ్యాటింగ్ మెరుగ్గానే ఉన్నా.. బౌలింగ్ ఆ జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్.. విండీస్‌తో అయిదో టీ20 కూడా ఆడేయబోతుండటం విశేషం.