
న్యూఢిల్లీ: భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కరోనా సెగ తగిలింది. శ్రీలంక టీమ్‌లో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు క్రిక్ బజ్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జులై 13(మంగళవారం) తొలి వన్డే జరగాల్సి ఉంది. కానీ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చిన శ్రీలంక జట్టులో 48 గంటల్లోని ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. శుక్రవారం ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కు పాజిటీవ్ అని తేలింది.
దాంతో శ్రీలంక టీమ్ క్వారంటైన్ పొడిగించాలని భావించిన లంక క్రికెట్ బోర్డు వన్డే సిరీస్‌ను ఐదు రోజుల తర్వాత ప్రారంభించాలని భావిస్తోంది. 13న జరగాల్సిన తొలి వన్డేను 17 లేదా 18 నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది. వాస్తవానికి జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగాల్సి ఉండగా.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ తాజా నిర్ణయంతో ఈ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. రివైజ్‌డ్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన శ్రీలంక టీమ్.. రెండు సిరీస్‌ల్లో క్వీన్ స్వీప్ అయింది. అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక జట్టుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. బ్యాటింగ్ కోచ్‌తో సహా అనలిస్ట్‌కు పాజిటివ్ వచ్చిందని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ప్లేయర్స్, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌కు టెస్టులు నిర్వహించగా నిరోషన్‌కు పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. అయితే ఆటగాళ్లకు మాత్రం నెగటీవ్ వచ్చిందని పేర్కొంది. ఫ్లవర్, నిరోషన్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.