శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేయలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.
రెండు వికెట్లను చేతిలో పెట్టుకొని విజయానికి కావాల్సిన ఒక్క పరుగు చేయలేకపోయింది. శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. అనంతరం భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
రోహిత్ శర్మ ( 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ ( 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్ ( 43 బంతుల్లో, 2 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) మూడేసి వికెట్లు తీయగా.. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటాడు.
అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్లు ఘోర తప్పిదం చేశారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఐసీసీ నిబంధనల విషయంలో అంపైర్లు బ్లండర్ మిస్టేక్ చేశారు. పాత రూల్స్ ప్రకారం మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్ నిర్వహించలేదు. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో మ్యాచ్ స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిబంధన లేదనే పాత్ రూల్ ప్రకారం అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. సూపర్ ఓవర్ నిర్వహించలేదు.
అయితే 2023లో ఐసీసీ ఈ నిబంధనను మార్చారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. టీ20ల్లో మాదిరే వన్డేల్లోనూ సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చాలని ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఐసీసీ నిబంధనల్లోని క్లాజ్ 16.4 ప్రకారం వన్డేల్లో ఇరు జట్ల స్కోర్ సమమైతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలనే నిబంధనను పెట్టింది.
నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ల ద్వారా ఫలితం తేలకపోతే..అప్పుడు టైగా ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అంపైర్లు ఈ నిబంధనను పట్టించుకోకుండా.. పాత రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్ ఆడించలేదు. దాంతో ఇరు జట్లకు తీవ్ర నష్టం జరిగింది.
రెండో వన్డే ఆదివారం కొలంబో వేదికగానే మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక కాకతాళీయమో ఏమో కానీ.. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య వరుసగా రెండు మ్యాచ్‌లు టైగా ముగిసాయి. మూడో టీ20లో ఇరు జట్ల స్కోర్లు టై కాగా.. సూపర్ ఓవర్‌లో భారత్ విజయం సాధించింది.