India vs Sri Lanka: బంతి బలంగా తగలడంతో ఏకాగ్రత కోల్పోయా: పృథ్వీ షా

కొలంబో: దుష్మంత చమీరా వేసిన బంతి తలకు తగిలాకే ఏకాగ్రత కోల్పోయినట్లు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. ఆదివారం శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్లతో గబ్బర్ సేన జయకేతనం ఎగురవేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంకా 80 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మంగళవారం రెండో వన్డే ఇదే మైదానంలో ప్రారంభం కానుంది.

క్రీజులో ఉన్నది కాసేపే అయినా:
శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్య ఛేదనలో పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1x6) ధాటిగా ఆడారు. ముఖ్యంగా షా తొలి ఓవర్ నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు క్రీజులో ఉన్నది కాసేపే అయినా.. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అయితే లంక పేసర్ చమీరా వేసిన ఐదో ఓవర్ చివరి బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. అప్పుడు హెల్మెట్ కూడా మెడభాగంలో కొంతవరకు విరిగిపోయింది. వెంటనే ఫిజియోలు వచ్చి పరీక్షించగా.. పెద్ద గాయం అవ్వలేదని నిర్ధారించారు. దాంతో బ్యాటింగ్ కొనసాగించిన షా మరుసటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్‌కు భారీ షాట్ ఆడబోయి.. అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు.

తలకు తగిలాకే ఏకాగ్రత కోల్పోయా:
మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ... 'ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలనే దాని గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏమీ చెప్పలేదు. నా సహజసిద్ధమైన ఆటనే ఆడాలనుకున్నా. నాకు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాలనిపించింది. అందుకే చెత్త బంతుల కోసం వేచి చూసి షాట్లు ఆడా. పిచ్ కూడా బాగా సహకరించింది. అదే సమయంలో లంక పేస్ బౌలింగ్‌ను ఆస్వాదించా. చమీరా వేసిన బంతి తలకు తగిలాకే ఏకాగ్రత కోల్పోయా. ఇప్పుడు బాగానే ఉంది' అని చెప్పాడు.
ENG vs PAK:బట్లర్ మెరుపులు..మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షో!పాకిస్థాన్‌పై రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం!

అడిలైడ్ టెస్టులో విఫలమయ్యాక:
గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో విఫలమయ్యాక బీసీసీఐ షాను పక్కనపెట్టింది. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకున్న పృథ్వీ.. ఆపై దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌లో అలరించాడు. ఈ నేపథ్యంలోనే షాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా భావించినా.. అలా జరగలేదు. అయితే శ్రీలంక పర్యటనకు మాత్రం ఎంపిక చేశారు. దీంతో బాగా ఆడి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications