
రాంచీ: మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టు కోసం భారత ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌లు అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా ప్రాక్టీస్ చేశారు. గురువారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు రన్నింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు.
IPl 2020: ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. బెంగళూరు సహాయక బృందంలో మహిళ!!
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సమక్షంలో పేస్ బౌలర్‌లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ చమటోడ్చారు. మరోవైపు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్నింగ్, బౌలింగ్ సాధన చేసాడు. వైస్ కెప్టెన్ రహానే క్యాచులు కూడా ఒడిసి పట్టుకున్నాడు. సాహా కీపింగ్ ప్రాక్టీస్ చేసాడు. వైజాగ్, పుణె టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రాంచీలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రాంచీ వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపగలరు కాబట్టి కుల్దీప్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
రవిశాస్త్రి, భరత్ అరుణ్ పిచ్‌ను పరిశీలించారు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్, రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర పోషిస్తాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, బవుమా, డిబ్రుయన్, డికాక్, ముత్తుస్వామి ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ చేతి గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు.
శనివారం ప్రారంభం కానున్న మూడో టెస్ట్ మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ హాజరుకానున్నారు. మూడో టెస్ట్ తొలి రోజే మ్యాచ్ చూడడానికి ధోనీ మైదానానికి వస్తున్నాడని సమాచారం తెలుస్తోంది. 'ధోనీ శనివారం రాంచీ చేరుకుంటాడు. అతను ఖచ్చితంగా మ్యాచ్‌కు హాజరవుతాడు. నాకు తెలిసినంతవరకు ధోనీ మొదటి రోజే మ్యాచ్ చూడడానికి మైదానంకు వస్తాడు' అని ధోనీ చిన్ననాటి కోచ్ ఓ ప్రకటనలో తెలిపాడు. ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.